– పలు జిల్లాల్లో భారీ వర్షాలు
– పాఠశాలలకు సెలవులు
– తమిళనాడులో తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్
అమరావతి- యంత్రాంగం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపాన్‌గా బలపడుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ కోస్తా జిల్లాలు వణుకుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో అల్పపీడనం మరింతబలపడి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా వైపుగా ప్రయనిస్తుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం నాడే తమిళానాడుతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. పలు చోట్ల పల్లపు ప్రాంతాలు జలమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చేపల వేటను నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విడివిడిగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నుండి రాయలసీమతోపాటు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా విశాఖ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతమైంది. ఈ జిల్లాల్లో పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, విద్యుత్, రెవెన్యూ, పోలీసు, నీటి పారుదల, వైద్య, గ్రామీణ నీటి సరఫరా శాఖల సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు సెలవులు రద్దు చేశారు. తీరప్రాంతంలో సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. పలు చోట్ల సముద్రం ముందు కొచ్చింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంకాలం వరకూ ఎడతెరిపి లేని వర్షం కురుసింది. ఈ జిల్లాలో బుధవారం వరకూ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. జలపాతాల వద్ద, ప్రాజెక్టుల వద్ద ‘నో ఎంట్రీ’ బోర్డులను ఏర్పాటు చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. నెల్లూరు జిల్లా వ్యాపితంగా 37 మీల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. మర్రిపాడు మండలం కేతమన్నేరు వాగు ఉధృతంగా ప్రవహి స్తోంది. ప్రకాశం జిల్లాలో ఒంగోలు, మద్దిపాడు, గిద్దలూరు, కోమరోలులో భారీ వర్షం కురిసింది. బాపట్ల, చీరాల, వేటపాలం,. చినగంజాం, నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, అవనిగడ్డల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
పిడుగుపాటుకు ఒకరి మృతి
కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఉప్పుమిల్లి గ్రామానికి చెందిన నందికొండ వీరస్వామి(35) తన రెండు గేదేలను పాకలో కట్టేసేందుకు పశువుల వద్దకు వెళ్లారు. పశువులను కట్టేస్తుండగా అతనికి సమీపంలో పిడుగుపడింది. తీవ్రంగా గాయపడిన వీరస్వామిని యానాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
తమిళనాడులో…
తమిళనాడులోని కోయయంబత్తూరు, మధురై జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్థంబించింది. హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. చెన్నై, తిరువళ్లూరు,కాంచీపురం, చెంగల్ పట్ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. మంగళవారం నుండి శుక్రవారం వరకు ఐటి ఉద్యోగులకు ఇంటి నుంచే పని విధానం అమలు చేయాలంది. మరోవైపు బుధవారం చెన్నైతో పాటు, పరిసర ప్రాంతాల్లోని మరో ఎనిమిది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.