– రైతును ముంచుతున్న దళారులు… సామాన్యుడి జేబుపై భారాలు
– ఏడాదిలో భారీగా పెరిగిన నిత్యావసర సరుకులు
– పప్పులు 17శాతం, పాలు 9శాతం, గోధుమలు 12శాతం, బియ్యం 15శాతం..
– వంట దినుసులు 20శాతం..మాంసం, చేపలు, గుడ్ల ధరలు పైపైకి
పంట ఉత్పత్తుల్ని అమ్ముకోవాలంటే రైతు వణికిపోతున్నాడు. మహారాష్ట్రలో ఇటీవల ఉల్లి పంట తీసుకొస్తే కిలోకు రూపాయి కూడా దక్కలేదు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో టమాటా రైతు పరిస్థితీ ఇదే. రోడ్డుమీద పారేసి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సరుకు రవాణా ఛార్జీలు కూడా రావటం లేదు. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారకాలు, లేబర్ చార్జీలు, డీజిల్ ఖర్చులు..ఇవన్నీ రైతు భరిస్తేనే పంట చేతికొస్తోంది. అమ్ముకుందామని మార్కెట్‌కు వస్తే..మార్కెట్ శక్తుల ఆటకు రైతు బలవుతున్నాడు. ధరలు అమాంతం పడిపోతున్నాయి. ధరల్ని నియంత్రించి రైతుకు న్యాయం చేద్దామన్న ఆలోచన కేంద్రంలోని పాలకులు చేయటం లేదు. మరోవైపు అధిక ధరలతో సామాన్యుడు గగ్గోలు పెడుతున్నారు.
న్యూఢిల్లీ : మార్కెట్ మాయజాలం ఏంటో ఇప్పుడు ప్రత్యక్షంగా కనపడుతోంది. ఆహార పంటల కొనుగోలు అంతా కూడా బడా కార్పొరేట్లు, అత్యంత ధనవంతుల చేతులో ఉందన్న విషయం సామాన్యుడికి అర్థమవుతోంది. ఉల్లి పంట రైతు దగ్గర నుంచి సేకరించాక, సామాన్యుడు వద్దకు వచ్చేసరికి ధర 65శాతం పెరిగింది. అలాగే టమాటా ధరలో 111శాతం తేడా నమోదైంది. ఉల్లి ధరలో 65శాతం, టమాటాలో 111శాతం మధ్య దళారాలు, మార్కెట్ ట్రేడర్స్ లాక్కుంటున్నారు. ఆహార రంగంలో ప్రయివేటు శక్తులు చెలరేగితే ఎలా ఉంటుందో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. మద్దతు ధర రావటం లేదని రైతు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని సామాన్యుడు ఆందోళన చెందుతున్నాడు.
పాల ధర ప్రతినెలా మారుతోంది. మార్చి 2022-మార్చి 2023 మధ్యకాలంలో పప్పు దినుసుల ధరలు 17శాతం, వంటలో వాడే దినుసుల ధర 20శాతం
పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాలే చెబుతున్నాయి. పాల ధర ఏడాదిలో 9.65శాతం పెరిగింది. మాంసం, చేపలు, గుడ్ల ధరలు భారీగా ఉన్నాయి. అధికారికంగా ధరల పెరుగుదల 3.4శాతంగా నమోదైంది. ఇక బియ్యం, గోధుమల సంగతి చెప్పక్కర్లేదు. ప్రతి నెలా వీటి ధరలు మారుతున్నాయి.సామాన్యుడు గోధుమల కోసం రేషన్ దుకాణం ముందు నిలుచుంటున్నాడు. గత ఏడాదిలో గోధుమ ధరలు 12శాతం, పిండి ధర 15శాతం, బియ్యం ధర 7శాతం పెరిగాయని ఆహార, వినియోగదారుల సంబంధాల శాఖ గణాంకాలు విడుదల చేసింది.గత ఏడాది ప్రారంభ ంలో గోధుమలను ఎగుమతి చేయాలని కేంద్రం నిర్ణయించటంతో దేశీయంగా ధరలు అమాంతం పెరిగిపోయాయి. పంటను పెద్ద ఎత్తున నిల్వచేసిన ట్రేడర్స్, మార్కెట్ దళారులు లాభపడ్డారు. ఉత్తరాదిన అనేక రాష్ట్రాల్లో గోధుమల కోసం రేషన్ దుకాణాల ముందు జనం క్యూ కట్టారు. గోధుమల స్థానంలో బియ్యం పంపిణీ చేసి కేంద్రం చేతులు దులుపుకుంది. కొన్ని ప్రాంతాల్లో గోధుమకు బదులు సజ్జలు ఇచ్చారు. నలుగురు సభ్యులున్న కుటుంబం..20 కిలోల గోధుమల్ని బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చింది.
ఇన్‌పుట్ ఖర్చు కూడా రావటం లేదు..
వాస్తవానికి బహిరంగ మార్కెట్‌లో ఉల్లి, బంగాళాదుంపలు, పాల ధరలు పెద్ద మొత్తంలో పెరిగాయి. మరోవైపు వ్యవసాయ మార్కెట్‌లో ఆ ఉత్పత్తులకు మద్దతు ధర రాక రైతు కన్నీరుపెట్టే పరిస్థితి. వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. బంగాళాదుంప, ఉల్లిగడ్డల్ని ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తారు. విత్తనాల కొనుగోలు, లేబర్ ఖర్చులు, ఎరువులు, క్రిమిసంహారకాలు, డీజిల్, విద్యుత్..మొదలైన వాటికైన ఇన్‌పుట్ ఖర్చులు కూడా రావటం లేదని రైతు గొంతు చించుకుంటున్నాడు. మోడీ సర్కార్ ఏమాత్రమూ స్పందించటం లేదు. ధరల్ని నియంత్రించాలన్న ఆలోచన లేదు. ప్రభుత్వం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధర ‘ఇన్‌పుట్ ధరల’ కన్నా తక్కువగా ఉంది.