పెండ్లి అయిన రెండు గంటలకే ట్రిపుల్‌ తలాఖ్‌

నవతెలంగాణ – లక్నో
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో కట్నం కింద కారు ఇవ్వలేదని పెండ్లి అయిన రెండు గంటలకే నవ వధువుకు ట్రిపుల్ తలాఖ్ చెప్పాడో వరుడు. ఆగ్రాలోని ఫతేహాబాద్‌కు చెందిన కమ్రాన్‌ వాసీ తన ఇద్దరు సోదరీమణులు డాలీ, గౌరీలకు ఒకే రోజు వివాహం జరిపించాడు. వివాహం అనంతరం గౌరీని ఆమె అత్తారింటివారు తీసుకెళ్లారు. అయితే డాలీని వివాహం చేసుకున్న వరుడు మొహమ్మద్ ఆసిఫ్ మాత్రం కట్నంలో భాగంగా తనకు కారు ఇవ్వలేదని అలిగాడు. తనకు కట్నం కింద కారు ఇస్తామని మాట ఇచ్చారని, ఇప్పుడు అది కనిపించడం లేదని డాలీ తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. వెంటనే కార కొనివ్వాలని లేదా రూ.5 లక్షలైనా ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. అయితే ఇప్పటికిప్పుడు ఆ రెండూ ఇవ్వడం తమవల్ల కాదని వారు చెప్పారు. దీంతో ఆసిఫ్ ఆ నవ వధువుకు ట్రిపుల్ తలాఖ్ చెప్పి, తన కుటుంబంతో వివాహ వేదిక నుంచి వెళ్లిపోయాడు. వధువు సోదరుడు కమ్రాన్ వాసీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆసిఫ్‌తోపాటు మరో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఏడుగురినీ అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తుప్రారంభించారు. కాగా, ముస్లింల వివాహం చట్టం-2019 ప్రకారం ట్రిపుల్‌ తలాఖ్‌ చెప్పి మహిళలకు విడాకులు ఇవ్వడం క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తారు.

Spread the love