– తాజా సర్వే
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష ఎన్నికల ఫ్రంట్‌రన్నర్ డొనాల్డ్ ట్రంప్ ఏడు స్వింగ్ రాష్ట్ర్రాలలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటే ఆధిక్యతలో ఉన్నాడు. అమెరికన్లలో ఎక్కువ శాతం అధికారంలో వున్న వ్యక్తిని ”చాలా ముసలివాడు”గా చూస్తున్నారు. 81 ఏండ్ల బైడెన్‌కు మద్దతు ఇచ్చేవారి సంఖ్య 43% తో పోలిస్తే, 48% మంది ఓటర్లు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థికి మద్దతు ఇస్తారని బ్లూమ్‌బెర్గ్ న్యూస్/మార్నింగ్ కన్సల్ట్ గురువారం విడుదల చేసిన ఒక సర్వేలో తేలింది. అరిజోనా (6%), జార్జియా (6%), మిచిగాన్ (2%), నెవాడా (6%), నార్త్ కరోలినా (9%), పెన్సిల్వేనియా (6%), విస్కాన్సిన్ (4%) – మొత్తం ఏడు కీలక రాష్ట్రాల్లో ట్రంప్ తన ప్రత్యర్థి కంటే అనేక పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారని సర్వే చూపిస్తుంది. సర్వేలో పాల్గొన్న వారిలో 82% మంది 81 ఏండ్ల బిడెన్‌ను ”చాలా ముసలివాడు” అని అభిప్రాయపడ్డారు. అయితే 47% మంది 77 ఏండ్ల ట్రంప్‌కు కూడా ఈ వివరణ వర్తిస్తుందని అభిప్రాయపడ్డారు. 38 శాతం మంది వీరిద్దరికీ అధ్యక్షుడిగా పని చేయటానికి వయసు మీరిందని పేర్కొన్నారు.
అయితే 59% మంది ట్రంప్‌ను ”ప్రమాదకరం” అని అభివర్ణించగా, 48% మంది బైడెన్ గురించి కూడా అలాగే చెప్పారు. 14% మంది ఇద్దరు నాయకులను ”ప్రమాదకరమైన” వారిగా అభివర్ణించారు. అంతేకాక 30% మంది మాత్రమే బైడెన్ ”మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడు” అని చెప్పారు. 47% మంది ఇది ట్రంప్‌కు కూడా వర్తిస్తుందని చెప్పారు. ఎక్కువ మంది అమెరికన్లు ట్రంప్‌ను ”మంచి ఆరోగ్యంతో”, ”బలమైన నాయకుడు”గా చూస్తారు. మరికొంత మందికి బైడెన్ మరింత దయగల అధ్యక్షుడిగా కనిపిస్తాడు.