ఈ నెల 15 నుంచి డిపార్టుమెంటల్‌ పరీక్షలు…టీఎస్‌పీఎస్సీ

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఈ ఏడాది మే నెల (2023 మే) సెషన్‌కు సంబంధించిన డిపార్టుమెంటల్ పరీక్షలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఈ నెల 15 నుంచి నిర్వహించనుంది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రెస్‌ నోట్‌ను రిలీజ్‌ చేసింది. ఈ నెల 15 నుంచి 24 వరకు పరీక్షలు జరుగుతాయని టీఎస్‌పీఎస్సీ తన ప్రకటనలో పేర్కొన్నది. సర్వే, లాంగ్వేజ్‌ పరీక్షలు మినహా మిగతా పరీక్షలన్నీ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు (సీబీటీ) విధానంలో, ఆ రెండు పరీక్షలు మాత్రం డిస్క్రిప్టివ్‌ విధానంలో జరుగుతాయని టీఎస్‌పీఎస్సీ స్పష్టంచేసింది. హెచ్ఎండీఏ పరిధిలోని రంగారెడ్డి జిల్లాతో కూడిన హైదరాబాద్‌ సహా తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 9 జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌లో పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ (www.tspsc.gov.in) ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పత్రికా ప్రకటనలో టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. పరీక్షల అనంతరం కూడా ఈ హాల్‌ టికెట్‌లను జాగ్రత్తగా భద్రపర్చుకోవాలని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లో డూప్లికేట్‌ హాల్‌టికెట్లను జారీచేయబోమని తెలిపింది. హాల్‌ టికెట్‌లను డౌన్‌లోడ్‌ చేయడంలో ఏమైనా సమస్యలు ఉంటే అభ్యర్థులు 040-22445566 ల్యాండ్‌లైన్‌ నెంబర్‌ ద్వారా హెల్ప్‌ డెస్క్‌ను సంప్రదించాలని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.

Spread the love