ఉప్ప‌ల్ స్టేడియంకు వెళ్లే క్రికెట్ అభిమానుల‌కు టీఎస్ఆర్‌టీసీ తీపి క‌బురు!

నవతెలంగాణ  -హైదరాబాద్: ఉప్ప‌ల్ వేదిక‌గా మ‌రో మూడు గంట‌ల్లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే), స‌న్‌రైజ‌ర్స్‌ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సంద‌ర్భంగా ఉప్ప‌ల్ స్టేడియంకు వెళ్లే క్రికెట్ అభిమానుల‌కు టీఎస్ఆర్‌టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. న‌గ‌రంలోని ప్ర‌ధాన‌ ప్రాంతాల నుంచి ఉప్ప‌ల్ స్టేడియంకు 60 ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు తెలియ‌జేసింది. ఈ మేర‌కు టీఎస్ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జ‌నార్ ఒక ట్వీట్ చేశారు. సొంత వాహ‌నాల్లో వెళ్లి ట్రాఫిక్‌లో చిక్కుకొని ఇక్క‌ట్లు ప‌డే కంటే ఆర్‌టీసీ బ‌స్సుల్లో వెళ్లం బెట‌ర్ అని చెప్పుకొచ్చారు. “క్రికెట్ అభిమానులకు విజ్ఞప్తి! ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ వర్సెస్ సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే ఐపీఎల్‌ మ్యాచ్‌కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టండి. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లే క్రికెట్ అభిమానుల కోసమే హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఉప్పల్ స్టేడియానికి టీఎస్ఆర్‌టీసీ నడుపుతోంది. ఈ బస్సులు సాయంత్రం 6 గంట‌లకు ప్రారంభ‌మై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బ‌య‌లుదేరుతాయి. వీటిని ఉపయోగించుకుని క్షేమంగా స్టేడియానికి వెళ్లి క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించాలని టీఎస్ఆర్‌టీసీ యాజమాన్యం కోరుతోంది” అని స‌జ్జ‌నార్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Spread the love