– పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్‌డీ సజ్జనార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని పట్టణ ప్రాంత ప్రయణీకుల కోసం రాయితీతో కూడిన పల్లెవెలుగు టౌన్ పాసుల్ని అమల్లోకి తెస్తున్నట్టు టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం బస్‌భవన్‌లో టౌన్ పాస్‌ల పోస్టర్‌ను ఆవిష్కరించారు. దీనివల్ల ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించే ప్రయాణీకులపై ఆర్థికభారం తగ్గుతుందని చెప్పారు. ప్రయోగాత్మకంగా ఈ పాసుల్ని కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో అమలు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ పాస్‌లు కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో 10 కిలో మీటర్లు, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయొచ్చని తెలిపారు. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800, ఐదు కిలోమీటర్ల పరిధికి రూ.500 టౌన్ బస్ పాస్ ధరను నిర్ణయించామన్నారు. నేటి నుంచే ఈ పాస్‌లు అమల్లోకి వస్తాయన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని ఆయన సూచించారు.