పేపర్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలి : టీఎస్‌యూటీఎఫ్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్న తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) లీకేజీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి.. నిందితులను కఠినంగా శిక్షించాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లక్షలాది మంది నిరుద్యోగులు తమ జీవితాలను ఫణంగా పెట్టి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న దశలో కొందరు సిబ్బంది కాసులకు కక్కుర్తి పడి పరీక్షా పత్రాలను తస్కరించటమేంటని వారు ప్రశ్నించారు. అత్యంత జాగ్రత్తలతో, స్వయం ప్రతిపత్తితో కార్యకలాపాలు సాగించాల్సిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు తన సిబ్బంది పై నియంత్రణ కొరవడటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తు ద్వారా గోప్యతా వైఫల్యాలకు బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి అవకతవకలు పునరావృతం కాకుండా సర్వీస్‌ కమిషన్‌ పని తీరును మెరుగు పరచి పటిష్టమైన స్వతంత్ర ఎంపిక సంస్థగా తీర్చిదిద్దాలని కోరారు.

Spread the love