చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి

– ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు
నవతెలంగాణ-మల్హర్‌రావు
జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండల కేంద్రమైన తాడిచెర్లలో చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. బొంతల రాజు-అనూష దంపతుల కుమారులు అరుణ్‌(12), కార్తీక్‌(10). ఆదివారం పాఠశాలకు సెలవు ఉండటంతో మేకలను మేపేందుకు గ్రామ శివారుకు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు పెంజేరువు చెరువులో పడి మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కాటారం సీఐ నాగార్జునరావు, కొయ్యుర్‌ ఏఎస్‌ఐ కుమారస్వామి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అరుణ్‌ 6వ, కార్తీక్‌ 4వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. పిల్లలిద్దరినీ విగతజీవులుగా చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న శ్రీపాద ట్రస్ట్‌ చైర్మెన్‌ దుద్దిళ్ల శ్రీనుబాబు ఘటనాస్థలానికి వచ్చి తల్లిదండ్రులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈతకు వెళ్లి ఇద్దరు బాలురులు మృతి-తొర్రూర్‌ రూరల్‌
మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌ మండలంలోని అమ్మాపురం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణం కోల్పోయారు. గ్రామంలోని పెద్ద చెరువులో ఈతకు వెళ్లి గంధం యాకూబ్‌(14), కిన్నెర జంపన్న(12) నీటిలో మునిగి చనిపోయారు.

Spread the love