చెక్‌డ్యామ్‌లో స్నానానికి వెళ్లి.. ఇద్దరు చిన్నారులు మృతి

నవతెలంగాణ – ఓదెల/జమ్మికుంట
చెక్‌డ్యామ్‌లో స్నానానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతిచెందిన విషాదకర సంఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో బుధవారం జరిగింది. స్థానికులు, పొత్కపల్లి ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామానికి చెందిన జూపాక అశోక్‌ కుమారుడు సాత్విక్‌, కాసర్ల సునీల్‌ కూతురు నిత్యర్తి వేసవి సెలవులకు వీణవంక మండలం కొండపాక గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. బుధవారం ఈ ఇద్దరు పిల్లలతో పాటు మరో నలుగురు పిల్లలు పొత్కపల్లి శివారులోని మానేరు చెక్‌డ్యామ్‌లో స్నానానికి వెళ్లారు. కాగా సాత్విక్‌(14), నిత్యర్తి(12) నీటిలోతు ఎక్కువ ఉన్న ప్రాంతంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న పొత్కపల్లి ఎస్‌ఐ రామకృష్ణ వెంటనే తన సిబ్బందితో చెక్‌ డ్యామ్‌కు చేరుకొని మునిగిన స్థలంలో వెతికించి చిన్నారులను బయటకు తీసి పోలీసు వాహనంలో హాస్పిటల్‌ తరలించారు.
చిన్నారులను పరీక్షించిన డాక్టర్లు.. వారు మృతిచెందినట్టు ధృవీకరించారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. పాప తల్లి కాసర్ల వందన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

 

Spread the love