రెండ్రోజులు వడగాలులు

– మూడ్రోజుల తర్వాత వర్షాలు…
– హెచ్చరించిన వాతావరణ శాఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో మరో రెండ్రోజులు తీవ్రమైన వడగాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆ త్వత వేడి తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయని అంచనా వేసింది. రాష్ట్రంలోకి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో వడగాల్పుల తీవ్రత కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే రెండ్రోజుల తర్వాత ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకూ రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం నైరుతీ రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట, పుట్టపర్తి, కర్ణాటకలోని రత్నగరి, కొప్పాల్‌ వరకూ విస్తరించి ఉన్నాయి. ఆదివారం నుంచి ఇవి ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని తెలంగాణలో ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కుమురం భీం, నిర్మల్‌, భూపాలపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయి. వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు డైరెక్టర్‌ తెలిపారు.

Spread the love