అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఇద్దరు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. వర్జీనియాలో రిచ్‌మండ్ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక తర్వాత జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. మంగళవారం రాత్రి హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక తర్వాత రిచ్‌మండ్‌‌లోని ఆల్ట్రియా థియేటర్ వెలుపల కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పులకు పాల్పడిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని రిచ్‌మండ్ తాత్కాలిక పోలీస్ చీఫ్ రిక్ ఎడ్వర్డ్స్ వెల్లడించారు. హ్యూగెనాట్ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ తర్వాత మన్రో పార్క్‌లో కాల్పులు జరిగినట్లు రిచ్‌మండ్ పబ్లిక్ స్కూల్స్ ప్రతినిధి మాథ్యూ స్టాన్లీ తెలిపారు. కాగా, ఈ కాల్పుల ఘటనపై రిచ్‌మండ్ మేయర్ లెవర్ ఎం. స్టోనీ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. కాల్పులు జరిగిన మన్రో పార్క్ వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ప్రజలెవరూ ఈ ప్రాంతానికి రావొద్దని మేయర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే ఆర్‌పీడీ, ఆర్‌పీఎస్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పిన ఆయన.. తమకు అందిన సమాచారాన్ని వచ్చింది వచ్చినట్టుగా అందుబాటులో ఉంచుతాన్నారు.

Spread the love