ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. ఒకరి పరిస్థితి విషమం

– ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం, లారీని ఢీకొట్టిన డీసీఎం.
– ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి. 
– డీసీఎం డ్రైవర్ పరిస్థితి విషమం. 
– రాయపోల్ మండలం వడ్డేపల్లి గుర్రాల సోఫా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.
నవతెలంగాణ – రాయపోల్
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామం గుర్రాల సోఫా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగగా ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటన సోమవారం సాయంత్రం రాయపోలు మండలం వడ్డేపల్లి గ్రామం గుర్రాలసోపా వద్ద చోటుచేసుకుంది. తొగుట సిఐ షేక్ లతీఫ్ తెలిపిన వివరాల ప్రకారం మొక్కజొన్న కంకులను నింపుకొని చేగుంట వైపు వెళుతున్న డిసిఎం వడ్డేపల్లి గుర్రాల సోఫా సమీపంలో అతివేగంగా వెళుతూ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. వాహనాన్ని నియంత్రించే క్రమంలో చేగుంట నుంచి గజ్వేల్ వైపు వస్తున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన లారీని ఢీకొట్టి బోల్తా పడింది. దౌల్తాబాద్ మండలం మాచిన్ పల్లి గ్రామానికి చెందిన మామిండ్ల నవీన్ (20), మామిండ్ల వంశీ (19) గజ్వేల్ వైపు వెళ్తుండగా డీసీఎం వాహనం బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామానికి చెందిన డీసీఎం డ్రైవర్ చాకలి రాకేష్ కు తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలతో విషమంగా ఉన్న డీసీఎం డ్రైవర్ రాకేష్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలంలో మృతి చెందిన నవీన్, వంశీ ఇద్దరు యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా మాచిన్ పల్లి ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో సంఘటన స్థలంలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. యుక్త వయసుకు వచ్చిన ఇద్దరు యువకులు పిన్న వయసులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తొగుట సీఐ షేక్ లతీఫ్ తెలిపారు.
Spread the love