ఏపీ హైకోర్టులో నారా లోకేశ్ రెండు లంచ్ మోషన్ పిటిషన్లు…

నవతెలంగాణ – హైదరాబాద్
ఏపీ హైకోర్టులో టీడీపీ యువనేత నారా లోకేశ్ రెండు లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిలో ఒక పిటిషన్ అమరావతి రింగ్ రోడ్డు కేసుకు సంబంధించినది. ఈ కేసులో తనకు సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసుల్లో కొన్ని నిబంధనలను సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ వేశారు. హెరిటేజ్ సంస్థకు చెందిన తీర్మానాలు, అకౌంట్ బుక్స్ తీసుకురావాలని నోటీసుల్లో సీఐడీ పేర్కొంది. వీటిని హైకోర్టులో లోకేశ్ సవాల్ చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ నుంచి తాను ఎప్పుడో బయటకు వచ్చానని… అలాంటప్పుడు వాటిని తానెలా తీసుకొస్తానని ఆయన పిటిషన్ లో అభ్యంతరం వ్యక్తం చేరారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మధ్యాహ్నం 2.15 గంటలకు పిటిషన్ ను హైకోర్టు విచారించనుంది. మరో లంచ్ మోషన్ పిటిషన్ ను ఏపీ ఫైబర్ గ్రిడ్ కు సంబంధించి లోకేశ్ దాఖలు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ పై ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఫైబర్ గ్రిడ్ తో తనకు సంబంధం లేదని… తన పేరును అకారణంగా కేసులో చేర్చారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ కూడా మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణకు రానుంది.

Spread the love