నవతెలంగాణ-హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్‌లో ఇద్దరు పోలీసులను కాల్చివేశారు. ఈ ఘటనలో మరో పోలీస్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం ఉదంపూర్ జిల్లా కేంద్రంలోని కాళీమాత ఆలయం వెలుపల పోలీస్ వ్యాన్‌లో బుల్లెట్ గాయాలతో మృతి చెందిన పోలీసుల మృతదేహాలు కనిపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడంతోనే ఇద్దరు మరణించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇద్దరి మధ్య కలహాలే కారణమని అనుమానిస్తున్నారు. రహమ్‌బాల్ ప్రాంతంలో వాగ్వాదం జరిగిందని.. ఆ తర్వాత ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడం ఇద్దరు మృతి చెందారని.. మరొకరు గాయపడ్డారని ఎస్‌ఎస్పీ అమోద్ నాగ్‌పురే పేర్కొన్నారు. డిపార్ట్‌మెంట్ వాహనంలో సోపోర్‌లోని ఎస్‌టీసీ తల్వారాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందన్నారు. ఈ ఘటన వెనుక నిజానిజాలను తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నట్లు వివరించారు. ప్రాథమిక విచారణలో AK-47 రైఫిల్ ఉపయోగించినట్లు తేలింది. గాయపడ్డ వ్యక్తి సురక్షితంగా ఉన్నారని.. పోస్టుమార్టం కోసం ఉదంపూర్ జీఎంసీకి తరలించినట్లు చెప్పారు.