నవతెలంగాణ – ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో చమోలీ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యాత్రికులు మృత్యువాత పడ్డారు. మృతులను నిర్మల్ షాహీ (36), సత్యనారాయణ (50) గా అక్కడి పోలీసులు తెలిపారు. వీరిద్దరూ బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుంటే మార్గమధ్యంలో కొండచరియలు వారిపై విరిగి పడ్డాయి. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కర్ణప్రయాగ, గౌచర్ మధ్యలోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై శనివారం ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వివరించారు.