ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి వెళ్తూ..ఇద్దరు యువకులు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : ఖైరతాబాద్ మహా గణపతి దర్శనం కోసం బయలుదేరిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోడుప్పల్ కు చెందిన యశ్వంత్ (22) డిగ్రీ విద్యను అభ్యసిస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన సాయిరాం (31) డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నారు. యశ్వంత్ సాయిరాం మంచి స్నేహితులు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవాలని ఉద్దేశంతో యశ్వంత్ సాయిరాం స్పోర్ట్స్ బైక్ పై బోడుప్పల్ నుంచి బయలుదేరారు. అడిక్ మెట్ ఫ్లై ఓవర్ పై బైకును అతివేగంగా నడపడంతో.. డివైడర్ ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ నడిపిన యశ్వంత్ అక్కడికక్కడే మరణించగా.. తీవ్ర గాయాల పాలైన సాయిరామును ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. వీరిద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Spread the love