నవతెలంగాణ- చెన్నై : ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాలని ఏఐఏడీఎంకే నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో బీజేపీ, ఏఐఏడీఎంకేలపై తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండు పార్టీలు తోడుదొంగలని మళ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేసేందుకు ముందుకొస్తాయని వ్యాఖ్యానించారు. ఒక పార్టీ దొంగ అయితే మరో పార్టీ దోపిడీదారని ఉదయనిధి స్టాలిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో ఏఐఏడీఎంకే తెగదెంపులు చేసుకున్నా 2024 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తు ఉండదని ఏఐఏడీఎంకే చెబుతున్నా ఆ పార్టీ శ్రేణులే నమ్మడం లేదని, మీ మాజీ సీఎం, మంత్రులపై ఈడీ కేసులు పెండింగ్‌లో ఉండటమే ఇందుకు కారణమని ఉదయనిధి స్టాలిన్ చెప్పారు. గతంలోనూ ఈ రెండు పార్టీలు పరస్పరం తలపడినట్టు నటించినా మళ్లీ ఎన్నికల ముందు ఇరు పార్టీలు కలిశాయని, రెండు పార్టీలూ తోడు దొంగలని కృష్ణగిరి జిల్లాలో డీఎంకే యువజన విభాగం నిర్వహించిన బహిరంగ సభలో పేర్కొన్నారు. ఏఐఏడీంకే నేతలపై కాషాయ నేతలు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నందున బీజేపీతో సంబంధాలను తెంచుకోవాలని నిర్ణయించామని ఏఐఏడీఎంకే సోమవారం ప్రకటించింది.అన్నాదురైపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలపై ఏఐఏడీఎంకే శ్రేణులు భగ్గుమన్నాయి.