ఉదయనిధి స్టాలిన్‌లు ఊరికొకరు కావాలి…

Udayanidhi Stalins need each other...ఈ మధ్య కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు యువజన, క్రీడలశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. ఈ వ్యాఖ్యలకు ప్రతీకగా స్వాములు, బీజేపీ నాయకులు అతని తలను తెస్తే కోట్ల రూపాయల నజరానా అని ప్రకటించారు. అతను అలా అనాల్సిన సందర్భం ఎందుకొచ్చింది? దాని నేపథ్యమేంటనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సనాతన పూర్వపరాలు ఒకసారి పరిశీలనచేస్తే అది భారతీయ పురాతన ధర్మమని, చాలా పవిత్రమైందని, అది ప్రపంచంలో గొప్ప పేరుగాంచిందని, కొంతమంది విశ్వాసుల నమ్మకం. సనాతన ధర్మం అనేది నాలుగు వర్ణాలపై ఏర్పడింది. అవి ముఖ్యంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణులు బ్రహ్మ తలకాయ నుండి పుట్టారని, వీరు దేవుని కంటే గొప్పవారని, దేవునికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటారని, అలాగే క్షత్రియులు రాజ్యాన్ని రక్షించడానికి కాపలాదారులని వీరు బహువులలో నుండి పుట్టారని, వైశ్యులు బ్రహ్మ తొడలలో నుండి పుట్టారని వీరు వర్తక, వ్యాపారం చేస్తారని చివరగా శూద్రజాతి వారు వీరు బ్రహ్మ పాదాల నుండి పుట్టారని వీరు పై మూడు కులాల వారికి సేవచేయలని సనాతన ధర్మం చెబుతోంది. ఇందులో భాగంగానే మనువు రాసిన మనుస్మృతి నాలుగు వర్ణ ధర్మాలను గైడ్‌ చేస్తూ ఎవరు ఏ పని చేయాలని ఆ పని విభాగాలను సూచిస్తుంది. పై మూడు వర్ణాలను ఉన్నతంగా తీర్చిదిద్ది నాలుగో వర్ణం కాడికి రాగానే తన అసలు రంగు బయటపెట్టింది. ఈ శూద్ర జాతిలో పంచములు అని కూడా విభజన చేసింది. ప్రస్తుతం మన దేశంలో నూటికి ఎనభైశాతంగా ఉన్న ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీలందరూ అందరూ శూద్ర జాతి వారే. సనాతన ధర్మం అనేది నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో భాగమైందని అందులో ఉండే మెజార్టీ ప్రజలను జంతువుల కంటే హీనంగా చూస్తారని ఉదయనిధి స్టాలిన్‌ అభిప్రాయం కావచ్చు.
శూద్ర జాతి ప్రజలను గుళ్లలోకి రానియక పోవడం, శ్లోకాలు చదివితే నాలుకలు తెగ్గోయడం, శ్లోకాలు వింటే చెవులల్లో సీసాలు పోసి చంపడం, మెడలో గంట కట్టి వీరు వస్తున్నప్పుడు ఆ గంట శబ్దం వినబడే క్రమంలో పై వర్ణంలో వాళ్లు ఇండ్లల్లోకి వెళ్లడం శుద్రజాతి వారి గాలి తగిలితే మైల పడుతుందని సనాతన ధర్మం చెబుతున్నది. ముందట లొట్టి, వెనుక కమ్మగట్టడం అత్యంత నీచమైన వృత్తులను చేయించడం, ఈ శుద్రజాతి వారందరినీ ఊరికి అవతల ఉంచడం, వీరితో పాటు స్త్రీలను అత్యంత అవమానకరమైన రీతిలో వంటకు, ఇంటికి పిల్లల ఉత్పత్తి సరుకుగానే తమ స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని నిర్బంధించి వారు భర్తకు సేవకురాలుగానే ఉండాలనివారి వల్ల ఈ సమాజం చెడిపోతుందని ఆ ధర్మం చెబుతోంది. వారు చంచల స్వభావులనీ, నీచ మనస్తత్వం కలిగిన వాళ్ళని, అధిక కామోద్రేకంతో ఉంటారని వారిపై ఒక వికృతమైన రాతలు రాసి స్త్రీలను మానసిక ఎదుగుదల లేకుండా అత్యంత దుర్భర పరిస్థితిలోకి నెట్టిన సందర్భాలు మనుధర్మ శాస్త్రంలో ఎన్నో ఉన్నాయి. సతీసహగమనం అనేది భర్త చనిపోతే భార్య కూడా చితిలో భర్తతో పాటు కాలిపోవాలని నీచమైనటువంటి ఆచారం మనధర్మం లోనిది. మనుధర్మంలో ఎవరైనా శుద్ర జాతి వారు దొంగతనం చేస్తే ఒక మలమల మసిలే నూనెలో ఒక రింగు వేసి ఆ రింగును చేయి కాలకుండా తీస్తే అతను దొంగ కాదని తేల్చేస్తారు అగ్రవర్ణాల వాళ్ళు. ఒకవేళ చేయి కాలితే అతను దొంగ అని చెపుతారు. అదేవిధంగా దొంగతనం చేశాడా లేదా అని తెలుసుకోవడానికి ఒక చిన్న రూమ్‌లో నాగుపాములను వేసి అందులో ఉంచుతారు. పాములు కరిస్తే దొంగ అని కరవకపోతే దొంగ కాదని తేలుస్తారు. ఇటువంటి మూర్ఖమైన చట్టాలను మరుధర్మశాస్త్రంలోనివే ప్రధానంగా ఇప్పుడు స్రీలు ఎదుర్కొంటున్నటువంటి సామాజిక సమస్యలు లైంగిక దాడులు, దోపిడీ, హింస, పీడన, అనేక రకాల సమస్యలకు మూలాలు మనుధర్మ శాస్త్రంలోనీవే అనడానికి ప్రత్యేకమైనటువంటి సాక్ష్యాలుగా మనం చెప్పొచ్చు. శూద్రజాతి వ్యక్తి అగ్రవర్ణ అమ్మాయిని ప్రేమిస్తే అతని మర్మాంగాన్ని కోసేయడం, తలను తీసేయడం ధర్మశాస్త్రంలోనివే.
ఈ దుర్మార్గపు విధానాలన్నీ సనాతన ధర్మంలో ఉన్నాయి కనుక ఉదయనిది స్టాలిన్‌ వ్యాఖ్యలు చారిత్రక నేపథ్యంతో వచ్చినవే. ఈ చట్టాలను మొదలు చార్వాకులు లోకాయుత్తులు బుద్ధుడు, సంత్‌ రవిదాస్‌, కబీర్దాస్‌, జ్యోతిరావు పూలే, సాహు మహారాజ్‌, బాబా సాహెబ్‌ అంబేద్కర్‌, నారాయణ గురు, అయ్యాంకాళి, పెరియర్‌ నాయక్‌, కరుణానిధి, ఇంకా ఎందరో మహానుభావులు సనాతన ధర్మంలో ఉండే అసమాన వ్యవస్థను తిరస్కరిస్తూ నూతన సమాజం కోసం తమ జీవితాలను ధారపోశారు. అటువంటి ప్రభావ స్ఫూర్తితో ఉదయనిది స్టాలిన్‌ ఆవ్యాఖ్యలు చేయడం మంచి విషయలే. పైన చెప్పిన మహానుభావులంతా దోపిడీ, పీడన, కుల ఆధిపత్యం లేని నూతన సమాజం సమానత్వంగా ఉండాలని ప్రకటించారు. కానీ ప్రస్తుత బీజేపీ పాలకులు గద్దెనెక్కిన తర్వాత మతోన్మాదాన్ని, కులోన్మాదాన్ని పెంచి పోషిస్తూ తమ రాజకీయ అస్తిత్వం ద్వారా పాలన కొనసాగిస్తున్న విధానం మనం చూస్తున్నాం. ప్రశ్నిస్తే దేశద్రోహులని, ముస్లింలంతా పరాయి దేశాలకు వెళ్లిపోవాలని, బుల్డోజర్లు పెట్టి ఇండ్లు కులగొట్టడం, కరోనా విపత్తు సంభవిస్తే మూఢనమ్మకాలు పెంచి పోషించడం, దళితులపై అత్యంత పాశవికంగా రేప్‌ చేసి హత్యచేయడం లాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. తినే తిండి మీద, కట్టుకునే బట్ట మీద, మాట్లాడే స్వేచ్ఛ మీద, నిర్బంధాన్ని ప్రయోగిస్తూ దేశద్రోహపు చట్టాలు ఉపయోగించి భావ ప్రకటన స్వేచ్ఛను నిర్బంధిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. మణిపూర్‌ రాష్ట్రంలో 70రోజులుగా జరుగుతున్న హింసోన్మాదం, దాని వెనుక ఉన్న మతోన్మాదం ఏ రకంగా పెంచి పోషించబడుతున్న దాని ప్రత్యేకమైన సాక్ష్యం ఆ రాష్ట్రంలో ఇద్దరు మహిళలని నగంగా ఊరేగించడం. అలాగే హర్యానా రాష్ట్రంలో మత ఘర్షణలు చూసాం. మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ మానవత్వాన్ని చంపేస్తూ మనుషుల మధ్య విభజన చేస్తూ మత రాజకీయం చేస్తున్నటువంటి విధానాలు ప్రస్తుత బీజేపీ పాలనలో కోకొల్లలు. వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని, ఇంటికి రూ.15లక్షలు తెచ్చి ఇస్తామని, దేశంలో సుస్థిర పాలన తీసుకొచ్చి దేశ ప్రజలకు సంక్షేమం, భద్రత ఇస్తామని గొప్ప ప్రగల్బాలు పలికారు. కానీ వీళ్లు గాంధీలను చంపిన గాడ్సేలను మొక్కడం, రాష్ట్రపతి ముర్ము, లాంటి వారిని నూతన పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి పిలవకపోవడం కనిపిస్తున్నవే.
ముఖ్యంగా నర హంతకులే దేశ అధినేతలై పాలిస్తున్న కాలంలో మనం బతుకుతున్నాం. ప్రియమైన ఈ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న సందర్భమిది. ఉదయనిది స్టాలిన్‌ వ్యాఖ్యలు సమాజంలో మనుషులందరూ సమానంగా ఉండాలని కుల, మత రహిత, సమాజంగా మనిషిని మనిషి ప్రేమించే ఉన్నత సమాజం కావాలనే ఒక గొప్ప మార్గదర్శకత్వం లోనివే. అటువంటి వ్యాఖ్యలు కోట్లాదిమంది ప్రజల హృదయాల్లో ప్రభావంతంగా బయటికి రావాలి. ఈ బుల్డోజర్‌ సంస్కృతి కలిగిన బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా అందరూ ఐక్యమత్యమే మహాబలంగా ఏర్పడాలి. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ఆ రాజ్యాంగంలో ఉండేటువంటి ప్రతి హక్కు ద్వారా కాషాయపు ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రశ్నించాలి. ప్రజా సంక్షేమం,ప్రజా భద్రత ప్రజా సమానత్వాన్ని ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మనం కూడగట్టకపోతే జర్మనీలో హిట్లర్‌ ఎలాగైతే అతని విధానాల ద్వారా కోట్లాదిమంది మరణాలకు కారకుడయ్యాడో మన దేశం కూడా అటువంటి దుస్థితికి రావడానికి అవకాశం లేకపోలేదు. ఈ దేశంలో ప్రగతిశీల, శాస్త్రీయ భావజాలం కలిగిన నాయకులు, విద్యార్థులు, మేధావు లంతా సమాజాన్ని నిత్యం చైతన్యపరిచే దిశగా కృషి చేయాలి. దేశాన్ని సనాతన ధర్మం వైపు నెడుతున్న మతోన్మాదులను, కులోన్మాదులకు వ్యతిరేకంగా పోరు సల్పాలి. లక్షలాదిమంది ఉదయనిది స్టాలిన్‌లుగా పుట్టుకొచ్చి రాబోయే ఎన్నికలో ఓటు ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.

ఉదయకుమార్‌
9553460621

Spread the love