నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు దేశ రాజధానిలో ఆయన బిజీబిజీగా గడపనున్నారు. ఢిల్లీ టూర్‌లో భాగంగా ఠాక్రే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఇతర ఇండియా కూటమి నేతలతో సమావేశం కానున్నారు. ఠాక్రే ఢిల్లీ పర్యటనపై ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ వివరాలు వెల్లడించారు. ఆదిత్య ఠాక్రేతో కలిసి ఉద్ధవ్ దేశ రాజధానిలో మూడు రోజుల పాటు పర్యటిస్తారని చెప్పారు. ఠాక్రే హస్తిన టూర్‌లో భాగంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సహా పలువురు విపక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతారని తెలిపారు. ఢిల్లీలో ఠాక్రే టీఎంసీ, ఆప్, ఎస్పీ నేతలను కూడా కలుస్తారని వెల్లడించారు. పలు అంశాలపై విపక్ష నేతలతో ఉద్ధవ్ చర్చలు జరుపుతారని చెప్పారు. పలువురు ఇతర పార్టీలకు చెందిన మహారాష్ట్ర ఎంపీలు సైతం ఠాక్రేను ఢిల్లీ పర్యటనలో భాగంగా కలిసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని సంజయ్ రౌత్ వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన అనంతరం తమ జాతీయ అధ్యక్షుడు తొలిసారిగా ఢిల్లీ వెళుతున్నారని చెప్పారు.