70 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన ఉగాండా మహిళ..

నవతెలంగాణ – హైదరాబాద్: 40 ఏళ్లు నిండిన మహిళలు పిల్లల్ని కనడం కాస్త కష్టమే. అలాంటిది 70 ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు కవలపిల్లలకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన తూర్పు ఆఫ్రికాలోని ఉగాండాలో చోటు చేసుకుంది. ఉగాండాకు చెందిన సఫీనా నముక్వాయా అనే మహిళ వయసు ప్రస్తుతం 70 ఏళ్లు. సంతానోత్పత్తి పద్ధతుల ద్వారా ఆమె తాజాగా కవల పిల్లలకు జన్మనిచ్చింది. కంపాలా నగరంలోని ఓ ఆసుపత్రిలో బుధవారం ఆమెకు సిజేరియన్‌ ద్వారా బాబు, పాప పుట్టారు. తల్లి, బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇన్‌ విట్రో ఫలదీకరణ (IVF) చికిత్స ద్వారా ఆమె సంతాన భాగ్యం పొందినట్టు పేర్కొన్నారు. 2020లోనూ సఫీనా ఐవీఎఫ్‌ ద్వారా ఓ కుమార్తెకు జన్మనిచ్చింది. ఈ వయసులో కవలలకు జన్మనిచ్చిన సఫీనా.. ఆఫ్రికాలోనే అత్యంత పెద్ద వయసులో తల్లైన మహిళగా రికార్డు సృష్టించింది.

Spread the love