యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) విశ్వవిద్యాలయాలు, కళాశాలలో ఉపాధ్యాయులు అకాడమిక్ సిబ్బంది నియామకాలు, ప్రమోషన్స్ కోసం కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాల నిర్వహణ పేరుతో యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు-2025 పేరుతో జనవరి 6న ఒక డ్రాఫ్ట్‌ను విడుదల చేసింది. దీనిపై ఫిబ్రవరి 5నాటికి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని నూతన మారదర్శకాలను తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ ముసాయిదాలోని యూజీసీ ప్రతిపాదనల్ని పరిశీలిస్తే రాజ్యాంగ విలువల్ని బలహీనపరిచే విధంగా ఉన్నాయి. భారతదేశ ఉన్నత విద్యారంగంలో ఇవి ప్రమాదకర సంకేతాలుగా కనిపిస్తున్నాయి. అంతేకాదు, ఫెడరలిజం, బహుళత్వం, విద్యా సమగ్రతలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. విద్యను మరింత కేంద్రీకరణ, కార్పొరేటీకరణ చేసే దిశగా బీజేపీ సర్కార్ విధానాల్ని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే కేరళ, తమిళనాడు వంటి ప్రతిపక్షపాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వీసీల నియామకంపై గవర్నర్లతో విభేదాలున్నాయి. ఇప్పుడు సవరించిన నిబంధనలతో వీసీల ఎంపిక ఛాన్సలర్‌గా ఉన్న రాష్ట్ర గవర్నర్లకు ఎక్కువ అధికారాల్ని అందిస్తున్నాయి. ఇది సమాఖ్య స్ఫూర్తి ఖూనీ అవడానికి, తమ భావజాల వ్యక్తులను నియమించుకోవడానికి దోహదం చేసే అవకాశాలున్నాయి. ఫెడరలిజం ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించడమే కాదు, విద్యలో రాష్ట్రాల హక్కులను, స్వయం ప్రతిపత్తిని అణిచేసే విధంగా ఉన్నాయి.పూర్తిగా కేంద్రం చెప్పుచేతల్లో ఉండి నిర్ణయాధికారం చేసే ప్రతిపాదనలు సిద్ధం కాబోతున్నాయి!
భారత రాజ్యాంగం ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య యూజీసీ నిబంధనల ద్వారా కేంద్రం రాష్ట్రాల హక్కులను లాక్కొంటుంది. నూతన జాతీయ విద్యావిధానం-2020ని అమలు చేయడం ద్వారా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాల్లోనూ ఇది బలవంతంగా అమలు చేసే కుట్రక్కూడా తెరలేపుతుంది. ఇప్పటికే తమిళనాడు, కర్నాటక, కేరళ లాంటి రాష్ట్రాలు ఎన్‌ఈపిని అమలు చేయకుండా రాష్ట్ర విద్యావిధానంతో ముందుకు సాగుతున్నాయి. ఈ నిబంధనల పేరుతో విద్యా సంస్థలను, నియామకాలను గ్రేడింగ్‌చేసే విధానాన్ని ముందుకు తీసుకొస్తుంది. ఎస్‌ఈపీకి లింక్‌చేసి రాష్ట్రాలను వారి ప్రాంతీయ ప్రాధాన్యతలు, భాషాహక్కులు, విద్యాతత్వాలకు విరుద్ధమైన విధా నాలను అచరించేలా యూజీసీ బలవంతం చేస్తుంది. ఇది సమాఖ్య సుత్రాలను తిలోదకాలిచ్చే విధానాలకు పూనుకుంటుంది. ఎస్‌ఈపి అమలులో భాగంగా కేంద్రం తీసుకున్న నాలుగేండ్ల డిగ్రీ కార్యక్రమం అమలు చేయడానికి తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలు నిరాకరిస్తున్నాయి. ఎందుకంటే ఈ విధానం ద్వారా అందరికీ సరిపోయే సమాన విద్యను అందించేందుకు సాధ్యం కాదు. మనదేశంలో విభిన్న సామాజిక, రాజకీయ, భాషా, సాంస్కృతిక సందర్భాలు ఒక్కటిగా లేవు. అందుకే ఇది విద్యను బలవంతంగా కేంద్రీకరించి, వారు తీసుకొస్తున్న విధానాలను రాష్ట్రాలపై రుద్దడమనేది ఈ నిబంధనల్లో ఉంది. ఇది ఉన్నత విద్యనుండి పేదలను దూరంచేసే కుట్ర తప్ప వేరేకాదు. అంతేకాదు, విద్యా కేంద్రీకరణ వల్ల కేంద్రం పెత్తనం పెరిగి అసమానతలకు దారితీసే అవకాశమూ లేకపోలేదు.
ముసాయిదాలో స్పష్టతలేని అంశాలు
మరోపక్క విద్యను మరింత కార్పోరేటీకరణ చేసేందుకు పరిశ్రమల నుండి నిపుణులను, ప్రభుత్వరంగ అనుభవజ్ఞులను వైస్ ఛాన్సలర్స్‌గా తీసుకురావాలనే ప్రతిపాదన ఉన్నతవిద్యలో ప్రమాదకరమైన కార్పోరేటీకరణను సూచిస్తుంది. ఈ నిబంధన విద్యారంగంలో కార్పోరేట్ సంస్కృతిని పరిచయం చేసి అకాడమిక్ అర్హత పరిశోధన అంశాల ప్రచురణ, భోదన అనుభవం లాంటి అంశాలకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వదు. పరిశోధనల నుండి ప్రభుత్వం తన భాధ్యతలను ఉపసంహరించుకుని ”ఏంజెల్ లేదా వెంచర్ ఫండ్స్” పేరుతో వివిధ ప్రయివేటు, కార్పోరేట్ వ్యక్తులకు విద్యలోకి మార్గం సుగమం చేస్తుంది. ఇది మొత్తం విద్యా వ్యవస్థను మార్కెట్‌మయం చేస్తుంది. అసలు ”ఏంజెల్ లేదా వెంచర్ ఫండ్స్” అంటే ఏమిటి అనేది కూడా ఈ ముసాయిదాలో స్పష్టత లేదు. ఉపాధ్యాయులను రిక్రూట్ చేసే క్రమంలో రిజర్వేషన్ల గురించి కూడా ఈ ముసాయిదాలో కనీస ప్రస్తావన లేదు. ఈ నిర్ణయాలతో ”ఆధునీకరణ” ముసుగులో యూజీసీ విద్యాసంస్థల పగ్గాలను టెక్నో క్రాట్లు, కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పి ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత కార్పొరేటీకరణ, ప్రయివేటీకరణ చేయడానికి ఈ ప్రతిపాదనలు పూనుకుంటాయి.ఈ నిబంధనల్లో ”ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్” (ఐకెఎస్)ను ప్రమోట్ చేయాలనే పేరుతో విద్యలో సంఫ్‌ుపరివార్, సంస్కృతి ఆధిపత్యాన్ని అమలుచేసే కుట్ర దీనిలో దాగి ఉంది.
పెరగనున్న అసమానతలు
ఈ నిబంధనల్లో విద్యాసంస్థలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నియామకాల్లో రిజర్వేషన్స్ గురించి ప్రస్తావన లేదు. నేడు విద్యారంగంలో పెరుగుతున్న ప్రయివేటీకరణ మూలంగా అట్టడుగు వర్గాలకు విద్య అందుబాటులో ఉండటం లేదు. వారికి విద్యనందించేందుకు సంస్కరణలుండాలి కానీ వారిని మరింత దూరం చేసే విధంగా ఈ నిబంధనలున్నాయి. ఐఐటి వంటి సంస్థల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు, కుల ఆధారిత వివక్ష, ఆర్థికంగా బలహీన వర్గాలు, వైకల్యాలున్న విద్యార్థులను చేర్చుకునే నిబంధనలున్నప్పటికీ అమలు కావడం లేదు. నియామకాలు, ప్రవేశాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులను వ్యవస్థాగతంగా మినహాయిస్తూ ఈ ఖాళీలను భర్తీ చేయకుండా వదిలేస్తున్నారు. యూజీసీ ప్రతిపాదించిన నిబంధనల్లో ఈ అంశానికి సంబంధించి ప్రమోషన్ల విషయంలో క్లాజ్ 38లో భోదన, పరిశోధనపై ప్రత్యక్ష సంబంధం లేని కార్యకలాపాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. పదోన్నతుల్లో రిజర్వేషన్లు లేకుండా విస్మరిస్తూ విద్యారంగంలో సవరణ అధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఇప్పటికే అడ్మిషన్లు, నియామకాలు, విద్యార్థుల సంక్షేమంలో కులవివక్ష లేకుండా జవాబుదారీతనం ఉండేలా ప్రతిపాదనలు చేయడంలో యూజీసీ విఫలమైంది. విద్యాసంస్థల్లో రోహిత్ వేముల వ్యవస్థీకృత హత్యలాంటి ఘటనలు జరగకుండా, చర్యలు తీసుకోకుండా, సమస్యలు పరిష్కరించడానికి బదులుగా పరిశోధన ప్రాధాన్యతలను నిర్లక్ష్యం చేస్తున్నది. పైగా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులను, ఉద్యోగాలకు సాంకేతిక వ్యక్తిగత నైపుణ్యాలను మెరుగుపరచాలనే పేరుతో కార్పోరేట్ ప్రపంచానికి సిద్ధం చేయడానికి ”కార్పొరేట్ ఫినిషింగ్ స్కూల్” నమూనాను రూపొందిస్తున్నది. ఇది మరింత అసమానతలను పెంచి ఇలాగే కొనసాగేలా చేస్తుంది. ఇది పనిభారం పెంచడానికి, ఉద్యోగాలను తగ్గించే ఒక ప్రమాదకరమైన వ్యూహానికీ తోడ్పడుతుంది.
విద్య రాష్ట్ర జాబితాలోనే ఉండాలి
కేంద్రం ఇప్పటికే జాతీయ నూతన విద్యావిధానం -2020 పేరుతో విద్యను పూర్తిగా తమ ఆధిపత్యంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. విద్య కేంద్రీకరణ, కార్పోరేటికరణ, వ్యాపారీకరణను ప్రోత్సహించే నిర్ణయాలు చేస్తున్నది. ఈ విద్యావిధానానికి సంబంధించి రూపకల్పన విషయంలో నియంత్రణ అవసరం. అలాగే రాష్ట్రాల జాబితాలోనే విద్య ఉండటమనేది ప్రాధాన్యతగా ముందుకు రావాల్సిన అంశం. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు, కేరళ రాష్ట్రాలు విద్యపై చేస్తున్న కృషి అందరికీ ఆదర్శం. ఇదే సందర్భంలో ఈ రాష్ట్రాలపై గవర్నర్లతో విద్యావ్యవస్థపై ఎంతదాడి జరుగుతుందో చూస్తున్నాము. వాస్తవానికి రాష్ట్రాలు తమ ప్రత్యేక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థికాంశాలకు అనుగుణంగా విద్యావిధానాలు రూపొందించుకోవాలనే ప్రాముఖ్యతను రాష్ట్రాలు నొక్కిచెబుతున్నాయి. యూజీసీ ముసాయిదా పేరుతో తీసుకుంటున్న ఈ చర్యలు పరిపాలనపరమైన సమస్య కాదు, ఇది భారత రాజ్యాంగ నిర్మాణంపై దాడిగా చూడాలి. ఇప్పటికే రాష్ట్రాలు విద్యలో తమ హక్కులు తిరిగిపొందేందుకు, విద్యలో స్వయం నిర్ణయాధికారం, విద్యా స్వతంత్రతను కోరుకుంటు న్నాయి. భారతదేశంలో విశ్వవిద్యాలయాలు సైద్ధాంతిక నియంత్రణ, కార్పోరేట్ శక్తులకు లాభదాయక సాధనాలుగా, హిందూత్వ ప్రచార సాధనాలుగా మారకుండా ఉద్యమించాలి. ఉన్నత విద్యను కాపాడుకునేందుకు విద్యావేత్తలు, విద్యార్థులు యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరమైతే ఉన్నది.
– టి.నాగరాజు, 9490098292