ఉగ్ర యమునా

– విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌
– పలు ప్రాంతాలు నీటి మునక ..జలమయమైన రోడ్లు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
యమునా నది ఉగ్రరూపం దాల్చింది. నదీ పరీవాహక ప్రాంతం ప్రమాద స్థాయిని మించింది. గురువారం మధ్యాహ్నం 2 గంటల వరకు యమునా నీటి మట్టం ఎన్నడూ లేని విధంగా 208.82 మీటర్లకు చేరి ప్రమాదకర స్థాయిని దాటింది. దీనివల్ల నీటి మట్టం పెరిగిపోవడంతో ఢిల్లీలోని వీధులు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సీఎం కేజ్రీవాల్‌ నివాసం కూడా వరద తాకిడికి గురైంది. ఎర్రకోటను వరద నీరు ముంచెత్తింది. యమునా ఉగ్రరూపంతో ఢిల్లీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఔటర్‌ రింగు రోడ్డులోని కొన్ని ప్రాంతాలతోపాటు పలు రహదారులపై నీళ్లు వచ్చి చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రత్యామ్నాయ మార్గాలలో వాహనాలను తరలించడంతో భారీ ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వరద వల్ల నగరంలోని మెట్రోపై కూడా ప్రభావం పడింది. యమునా బ్యాంక్‌ మెట్రో స్టేషన్‌ వద్ద రోడ్డులో వరద నీరు వచ్చి చేరడంతో ఈ స్టేషన్‌ తోపాటుగా బ్లూలైన్‌ మూసివేశారు. వరద తాకిడితో ఢిల్లీలోని ప్రాంతాలలో రోడ్లను మూసివేశారు. మరోవైపు కొన్నిచోట్ల ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే 144 సెక్షన్‌ అమలవుతోంది. దీంతో అప్రమత్తమైన ఎన్డీఆర్‌ఎఫ్‌ 12 బృందాలను రంగంలోకి దింపింది. సహాయ చర్యల్లో భాగంగా లోతట్టు ప్రాంతాల్లోని 20 వేలకు పైగా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మరో కొన్ని గంటల్లో వరద ఉధృతి క్రమంగా తగ్గే అవకాశముందని సీడబ్ల్యూసీ అంచనా వేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ నగరంలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
నదులను తలపిస్తున్న రహదారులు…
ఢిల్లీ రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. ఇండ్లు, ఆస్పత్రులు, శ్మశానవాటికలు, షెల్టర్‌ హౌమ్‌ లలోకి కూడా నీరు ప్రవహించింది. రోడ్లన్ని జలమయమయ్యాయి. ఢిల్లీ సచివాలయంలోని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఆయన క్యాబినెట్‌ సహచరుల కార్యాలయాలు నీట మునిగాయి. రాజ్‌ఘాట్‌ నుంచి సచివాలయం వరకు ఉన్న రోడ్డు కూడా మునిగింది. ఇండియా గేట్‌ పరిసరాల్లోకి వరద నీరు చేరడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే కాశ్మీరీ గేట్‌, ఐటీఓ, మజ్ను కటిలా, లోహపూల్‌, మయూర్‌ విహార్‌, సరితా విహార్‌, సివిల్‌ లైన్స్‌ తోపాటుగా సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇల్లు కూడా వరద ప్రభావానికి గురైంది. ఎర్రకోట వెనుక ప్రాంతం వరదలకు గురైంది. ఇదే ప్రాంతలోనే ఉన్నటువంటి నిగంబోధ్‌ స్మశాన వాటికలో నీరు చేరడంతో దహన సంస్కారాలను నిలిపివేశారు. ఇప్పటికే దాదాపు 20 వేల మంది లోతట్టు ప్రాంత ప్రజలను ఢిల్లీ ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇదిలాఉండగా యమునా నది ప్రవాహనంలో నగరంలోని వీధుల్లోకి రాకుండా ఉండేందుకు వరద ముంపు నివారణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా యుమునా నది ఘాట్‌ వద్ద నిలువ ఉంచిన ఇసుక, మట్టిని వేలాది బస్తాల్లో నింపి నీటి ఉధృతిని అడ్డుకునేందుకు వాటిని తరలిస్తున్నారు.
వరద నీటితోనే ముప్పు..
ఢిల్లీలో వర్షాలు కురువనప్పటికీ ఎగున వదిలిన నీటితోనే యుమునా రికార్డు స్థాయిని దాటి ప్రవహిస్తోంది. నీటి మట్టం గురువారం గత కాలపు రికార్డులను అధిగమించి, ప్రమాద స్థాయిని దాటి 208.48 మీటర్లకు పెరిగింది. 45 ఏళ్ళ క్రితం 207.49 మీటర్ల నీటి మట్టం నమోదైంది. యమునా నదిపై రెండు ప్రధాన బ్యారేజీలు ఉన్నాయి.. ఒకటి డెహ్రాడూన్లోని దప్పత్తర్లో, మరొకటి హిమాచల్‌ లో హత్నికుండ్‌ బ్యారేజి. అయితే ఈ వరదలకు కారణం యమునా నదిపై ఎలాంటి భారీ ప్రాజెక్టులు లేవు. దీంతో వర్షాకాలం వచ్చిన వరద నీటిని కిందకి విడిచిపెట్టడంతో ఢిల్లీకి వరద పోటెత్తుతుంది. ఇదే ఇప్పుడు ఢిల్లీకి ముప్పు తెచ్చి పెడుతుంది.
గత మూడు రోజులుగా ఢిల్లీలో యమునా నది నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో, హత్నికుండ్‌ బ్యారేజీ నుంచి నీటిని నెమ్మదిగా విడుదల చేయాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షాకు లేఖ రాసినప్పటికీ, ఎగువన బారీ వర్షాలు నమోదు కావడంతో కిందకు నీటిని వదులుతున్నారు. దీంతో యమునా నది వరద ఉధృతిపై ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ సమావేశం నిర్వహించింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీ పరిధిలోని అన్ని విద్యా సంస్థలకు ఆదివారం వరకు సెలవులను ముఖ్యమంత్రి కేజ్రివాల్‌ ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇంటి నుంచే పని చేయాలని నిర్ణయించారు. ప్రైవేట్‌ కార్యాలయాలు కూడా వర్క్‌ ఫర్‌ హౌమ్‌ చేయాలని సూచించారు. అవసరమైన సేవల వాహనాలు మినహా భారీ వాహనాలను రాకపోకలను రద్దు చేశారు.
సుశ్రుత ట్రామా సెంటర్‌ లోకి వరద నీరు..
నార్త్‌ ఢిల్లీలోని మెట్కాఫ్‌ రోడ్‌ లోని సుశ్రుత ట్రామా సెంటర్‌ లోకి వరద నీరు వచ్చి చేరింది. అయితే ఆస్పత్రిలో 40 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఇందులో ముగ్గురు పేషంట్లకు వెంటిలేటర్‌ పై చికిత్స అందిస్తున్నారు. రోగులందరిని సుశ్రుత ట్రామా సెంటర్‌ నుంచి ఎల్‌ఎన్జెపి ఆస్పత్రికి తరలించారు. సౌత్‌ వెస్ట్‌ ఢిల్లీలోని చత్తాపూర్‌, ఐజీఎన్‌ ఓయూ, అయానగర్‌, దీరామండి, ఎన్సీఆర్‌ పరిధిలోని గుర్గామ్‌, మన్సీర్‌, ఇవేకాక సికిందరాబాద్‌, బులంద్‌ షేహర్‌, ఖార్జూ, యుపిలోని పలు ప్రాంతాల్లో రాబోయే కొన్నిగంటలలో ఉరుములు మెరుపులతో కూడిన సాధారణ వర్షపాతం నమోదవుతుదయ్యే అవకాశం ఉందని రీజినల్‌ వెదర్‌ ఫోర్‌ కాస్ట్‌ సెంటర్‌ వెల్లడించింది.

Spread the love