జకార్తా : రష్యాతో శాంతి చర్చలు జరపటానికి ఇండొనేషియా చేసిన ప్రతిపాదనలను రష్యా ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయనే పేరుతో ఉక్రెయిన్ తిరస్కరించింది. రష్యా ఆక్రమించిన భూభాగాల నుంచి రష్యా వెనుదిరగటమే ఏకైక వాస్తవిక ప్రతిపాదన అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారు మైఖైల్ పొడొలియాక్ ఒక ట్వీట్ లో రాశాడు. ఉక్రెయిన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒలెగ్ నికొలెన్కో కూడా రష్యాలో కలుపుకున్న భూభాగాలను స్వాధీనం చెయ్యటం మినహా మరో మార్గం లేదని ఒక ఫేస్ బుక్ పోస్టులో రాశారు.రష్యా, ఉక్రెయిన్ సేనలు తమతమ వర్తమాన స్థితుల నుంచి 15కిలోమీటర్లు వెనక్కు ఉపసంహరించుకుని ఒక నిస్సైనిక ప్రాంతాన్ని స్రుష్టించాలని, అటువంటి నిస్సైనిక ప్రాంతాన్ని ఐక్యరాజ్య సమితి శాంతి సేనల పర్యవేక్షణలో ఉంచాలని సింగపూర్ లో శనివారం జరిగిన షంగ్రీలా భద్రతా ఫోరమ్ లో మాట్లాడుతూ ఇండొనేషియా రక్షణ మంత్రి, ప్రబోవో సుబియాంటో సూచించారు. అంతేకాకుండా తగాదా పడుతున్న ప్రాంతాలలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో రిఫరెండం జరిపి సమస్యను పరిష్కరించాలని కూడా ఆయన సూచించారు. ఇప్పటివరకు ఈ శాంతి ప్రతిపాదనలపైన రష్యా స్పందించలేదు. రష్యా, ఉక్రెయిన్ ల మధ్య శాంతి నెలకొనాలంటే ఉక్రెయిన్ నాటోలో చేరాలనే ఆలోచనను మానుకోవాలని, రష్యా తనలో కలుపుకున్న ప్రాంతాలపైన హక్కును వదులుకోవాలని రష్యా పట్టుబడుతోంది.