ఉమామహేశ్వరుని సొమ్ము స్వాహా.?

నవతెలంగాణ – అచ్చంపేట 
శ్రీశైలం ఉత్తర ద్వారంగా పేరుగాంచిన మండల పరిధిలోని ఉమామహేశ్వర స్వామి సొమ్ము  స్వాహా  చేస్తున్నారు. దినదినంగా అభివృద్ధి చెందుతున్న ఉమామహేశ్వరం దేవాలయంలో దేవుని సొమ్ముకు భద్రత కరువైంది. కంచ చేను మేసే చందంగా సిబ్బందే దేవాలయ ఆదాయాన్ని స్వాహా చేస్తున్నారు. గతంలో టెంకాయల వేలం పాట,  లడ్డు,  ప్రసాద్ విక్రయాల టెండర్ వేల డబ్బులు రూ.20 లక్షల రూపాయలు టెండర్ దారుడు ఎగనాగం పెట్టారు. దేవాదాయ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు కానీ స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేయలేకపోయారు. అప్పటినుండి లడ్డు,  ప్రసాద విక్రయాలు, కొబ్బరికాయలు విక్రయాలు దేవాలయం సిబ్బంది నిర్వహిస్తున్నారు. మళ్లీ ఇప్పుడు నిత్య అన్నదానం పర్యవేక్షణ చేసే సిబ్బంది రూ.7 లక్షల రూపాయలు స్వాహా చేశాడని ఆరోపణలు ఉన్నాయి. నిత్య అన్నదానంలో భోజనం చేసిన భక్తులు తమకు తోచిన ఆర్థిక సాయం చేస్తుంటారు. దీనిని పర్యవేక్షణ చేసే వ్యక్తి రోజువారి వచ్చిన సొమ్మును సంబంధించిన బ్యాంకు ఖాతాలో జమ చేయవలసి ఉంటుంది. కానీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆ వ్యక్తి డబ్బులు వ్యక్తిగతంగా అవసరాలకు వాడుతూ దుర్వినియోగం చేశాడనేది విమర్శలు ఉన్నాయి. దేవాదాయ శాఖ పర్యవేక్షణ లేకపోవడం వల్ల సిబ్బంది ఇష్టానుసారంగా భక్తులు కానుక రూపంలో ఇచ్చిన సొమ్మును చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఏడు లక్షలు సహాయం చేసిన వ్యక్తిని ప్రస్తుతం విధుల నుండి తొలగించినట్లు తెలుస్తుంది. భక్తులు దేవాలయం అభివృద్ధి కోసం కష్టపడిన సొమ్మును కానుకల రూపంలో దేవాలయానికి ఇస్తుంటే అధికారుల నిర్లక్ష్యం కారణంగా సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ భక్తుల సొమ్మును నిర్వీర్యం చేస్తున్నారు. ఈ విషయంపై దేవాదాశాఖ అధికారులు స్పందించి స్వాహా చేసిన డబ్బులు రికవరీ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఆలయ కమిటీ చైర్మన్ కందూరు సుధాకర్ ను వివరణ కోరగా.. నిత్య అన్నదానంలో భక్తులు ఇచ్చిన కానుకలు ఏడు లక్షలు రూపాయలు స్వాహా అయినట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే అతని విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. కచ్చితంగా దేవుని సొమ్మును రికవరీ చేస్తామని చెప్పారు.
Spread the love