భర్త మృతిని తట్టుకోలేక భార్య ఆత్మహత్య

నవతెలంగాణ-అంబర్‌పేట
వివాహమైన ఏడాదిన్నరకు భర్త మృతి చెందడంతో తట్టుకోలేని భార్య తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అంబర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. అడ్మిన్‌ ఎస్‌ఐ సాల్వేరు మల్లేశం వివరాల ప్రకారం బాగ్‌ అంబర్‌ పేట డివిజన్‌ పరిధిలోని డీడీ కాలనీకి చెందిన సాహితి (29) దాదాపు ఏడాదిన్నర క్రితం వనస్థలిపురంకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మనోజ్‌తో వివాహం జరిగింది. వారు అమెరికాలోని డల్లాస్‌లో ఉంటున్నారు. సాహితీ ఈ నెల 2వ తేదీన తన తల్లిదండ్రులను చూడటానికి బాగ్‌ అంబర్‌ పేట డీడీ కాలనీకి వచ్చింది. అయితే ఈ నెల 20వ తేదీన మనోజ్‌ డెల్లాస్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని ఈ నెల 23వ తేదీన ఇండియాకు తీసుకు వచ్చారు. 24వ తేదీ బుధవారం వనస్థలిపురంలో అంత్యక్రియలు నిర్వహిం చారు. సాయంత్రం సాహితి తన తల్లిదండ్రులతో కలిసి డీడీ కాలనీలోని తన ఇంటికి వచ్చింది. రాత్రి తన సోదరి సంజనతో కలిసి గదిలో నిద్రించింది. గురువారం ఉదయం 9 గంటల సమయంలో సంజన వాష్‌ రూమ్‌కు వెళ్లి పది నిమిషాల్లో తిరిగి వచ్చింది. తలుపులు నెట్టగా లోన గడియ వేసి కనిపించింది. ఎంతకీ సాహితి తలుపులు తెరవకపోవడంతో తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే ఆమె ఇంట్లోని ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని చనిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అంబర్‌ పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love