ఆస్పత్రి బిల్లు కట్టలేక

Unable to pay the hospital bill– బిడ్డను వదిలేసిన తల్లిదండ్రులు
– కాంచనబాగ్‌ ఓవైసీ ఆస్పత్రిలో ఘటన
నవతెలంగాణ-సంతోష్‌నగర్‌
ఆస్పత్రిలో బిల్లు కట్టే ఆర్థిక స్థోమత లేక ఆ తల్లిదండ్రులు పసికందును వదిలేసి వెళ్లారు. ఈ ఘటన హైదరాబాద్‌ పిసల్‌బండలోని ఓవైసీ ఆస్పత్రిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కె.నితిన్‌- ప్రవళ్లిక ఏడాది కిందట కులాంతర వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో నివాసం ఉంటున్నారు. వారికి 13 రోజుల కిందట కూతురు జన్మించింది. అయితే చిన్నారికి ఊపిరితిత్తుల్లో సమస్య ఉండటంతో స్థానిక డాక్టర్‌ను సంప్రదించారు. డాక్టర్‌ వెంటనే పెద్దాస్పత్రికి వెళ్లాలని సూచించారు. దాంతో వారు పిసల్‌బండలోని ఓవైసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు చిన్నారిని ఆస్పత్రిలో చేర్చుకొని చికిత్స అందిస్తున్నారు. చిన్నారి ఆరోగ్యం మెరుగుపడింది. కానీ రూ.లక్ష 16 వేల బిల్లు కట్టి చిన్నారిని తీసుకెళ్లాలని ఆస్పత్రి నిర్వాహకులు చెప్పారు. తల్లిదండ్రులు రూ.35000 కట్టారు. మిగతా డబ్బుల కోసం ప్రయత్నించారు. కానీ డబ్బు సర్దుబాటు కాలేదు. ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో మంగళవారం పసికందును ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు. రాత్రి వరకు తిరిగి రాలేదు.

Spread the love