కొల్‌కతాలో నిరుద్యోగుల నిరసన

 Unemployed protest in Kolkata–  రైల్వేలో ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్‌
కొల్‌కతా : రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న మూడు లక్షల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ కొల్‌కతాలో నిరుద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌ నిరుద్యోగుల జాయింట్‌ ఫోరం ఆధ్వర్యంలో రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) కార్యాలయం ఎదుట ఈ ప్రదర్శన జరిగింది. అసిస్టెంట్‌ లోకో పైలట్‌, టెక్నీషియన్‌, జూనియర్‌ ఇంజినీర్‌, ఎన్టీపీసీ గ్రూప్‌ సీ, డీ పోస్టులు సహా ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేశారు. ప్రదర్శన అనంతరం ఫోరం ప్రతినిధి బృందం అధికారులకు మెమొరాండం సమర్పించింది. నియామక ప్రక్రియను రూపొందిస్తున్నామని, త్వరలోనే పరీక్ష తేదీని ప్రకటిస్తామని అధికారులు హామీ ఇచ్చారని బృందం సభ్యులు విలేకరులకు తెలిపారు. 2019 నుండి ఉద్యోగ నియామక నోటిఫికేషన్‌ విడుదల చేయనందున అభ్యర్థుల వయోపరిమితిని సడలించాలని ఫోరం డిమాండ్‌ చేయగా, అధికారులు ఎలాంటి హామీ ఇవ్వలేదు.
ఫోరం తరఫున సీఐటీయూ నేత ఇందర్‌జిత్‌ ఘోష్‌ మాట్లాడుతూ సంవత్సరానికి రెండు కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని, రోజ్‌గార్‌ మేళాలో ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పారని, కానీ చేసిందేమీ లేదని విమర్శించారు. నియామకాల ప్రక్రియ ప్రారంభించని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. పరిమిత సంఖ్యలో పనిచేస్తున్న ఉద్యోగులపై పని భారం పెరగడం వల్లనే కోరమాండల్‌ రైలు ప్రమాదం జరిగిందని ఆయన చెప్పారు.

Spread the love