నిరుద్యోగ భారతం

Unemployment India– జూన్‌లో 9.2 శాతం
– ఎనిమిది నెలల గరిష్టానికి చేరిక

– 18.5 శాతం మహిళలకు పని దొరకడం లేదు
– దేశంలో ఆర్థిక మందగమనం..!
దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందని మోడీ సర్కార్‌ చేస్తున్న ప్రచార ఆర్భాటానికి.. ఉద్యోగ కల్పనకు సంబంధం లేకుండా పోతోంది. అధికారంలో రాగానే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామంటూ గద్దెనెక్కిన బీజేపీ..ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా తాత్సారం చేస్తోంది. మూడోసారి అధికారంలోకి వచ్చినా..యువతరం గురించి దృష్టిపెట్టడంలేదనటానికి తాజా నివేదికలు ధ్రువీకరిస్తున్నాయి. చదువుకుని అటు సర్కారు ఉద్యోగాలు రాక..ఇటు ప్రయివేటు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
న్యూఢిల్లీ: లింగ భేదంతో సంబంధం లేకుండా దేశంలో నిరుద్యోగం తాండవం చేస్తోంది. ప్రస్తుత ఏడాది జూన్‌లో నిరుద్యోగ రేటు ఏకంగా 9.2 శాతానికి ఎగిసి.. ఎనిమిది నెలల గరిష్ట స్థాయి వద్ద నమోదయ్యిందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) గురువారం ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఇంతక్రితం మే నెలలో నిరుద్యోగ స్థాయి రేటు 7 శాతంగా ఉంది. ఒక్క నెలలోనే అదనంగా 2.2 శాతం ఎగిసిపడటం.. ఆర్థిక వ్యవస్థలో డొల్లతనానికి.. మందగమనానికి నిదర్శనం. సీఎంఐఈ నిర్వహించిన కన్స్యూమర్‌ పిరమిడ్స్‌ హౌస్‌హోల్డ్‌ సర్వే రిపోర్ట్‌ ప్రకారం.. 2023 జూన్‌లో నమోదయిన 8.5 శాతం నిరుద్యోగంతో పోల్చినా గడిచిన నెలలో ఈ రేటు మరింత పెరిగింది. నిరుద్యోగుల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. గతేడాది జూన్‌లో మహిళల్లో నిరుద్యోగం 15.1శాతంగా ఉంటే.. ఈ ఏడాది జూన్‌లో 18.5 శాతానికి ఎగిసింది. పురుషుల్లో నిరుద్యోగం 7.7 శాతం నుంచి 7.8 శాతానికి చేరింది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య ఆధారంగా సిఎంఐఇ ఈ రేటును రూపొందిస్తుంది.
ఊర్లలో గడ్డు పరిస్థితులు..
పట్టణాలతో పోల్చితే ఊర్లలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ స్థాయి అధికంగా ఉన్నట్లు సిఎంఐఇ రిపోర్ట్‌ వెల్లడించింది. ఉపాధి లేక ప్రజలు సతమతం అవుతున్నారు. 2024 మేలో 6.3 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు జూన్‌ నాటికి 9.3 శాతానికి ఎగిసింది. గడిచిన జూన్‌లో గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల నిరుద్యోగం 8.2 శాతానికి ఎగిసింది. ఈ రేటు మేలో 5.4శాతంగా ఉంది. అదే సమయంలో మహిళల నిరుద్యోగ సంఖ్య 12.0 శాతం నుంచి ఏకంగా 17.1 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో మే లో 8.6 శాతంగా ఉన్న స్థూల నిరుద్యోగ రేటు.. జూన్‌లో 8.9 శాతానికి పెరిగింది. దేశంలో ఆర్థిక మందగమనం వల్ల ఈ పరిస్థితులు నెలకొన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. పెరుగుతున్న ధరలతో దేశీయంగా డిమాండ్‌ మందగించడంతో ఆర్థిక వ్యవస్థ రికవరీ నెమ్మదించడం వలన ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయన్నారు. దేశం పరిస్థితిని అంచనా వేయడానికి ఎకనామిక్స్‌ టైమ్స్‌ ఇటీవల ఒక సర్వే చేసింది. ఎన్డీఏ ప్రభుత్వానికి నిరుద్యోగం ప్రధాన సవాలు అని స్పష్టం చేసింది. దీనికి తోడు ద్రవ్యోల్బణం, అసమానతలు, రైతుల సమస్యలు, నిరంకుశత్వం పెరగడం, జైలులో ఉన్న ప్రతిపక్ష నాయకుల సంఖ్య పెరుగుతోండటంపై ఆందోళన వ్యక్తమైంది. దేశంలో నిరుద్యోగం ప్రమాదకరస్థాయికి చేరిందని ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు కౌశిక్‌ బసు కూడా గత నెలలో ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

Spread the love