– మరబోట్లు లేవు.. త్రిబుల్ ఐటీ రాలే..
– ఊసే లేని పీజీ, డిగ్రీ, కళాశాలలు
– మళ్లీ నేడు అచ్చంపేట, వనపర్తికి సీఎం కేసీఆర్ రాక
నవ తెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
”శ్రీశైలం రిజర్వాయర్‌లో తెలంగాణ వాటా ఉంది.. అది ఎవడి అబ్బా జాగీర్ కాదు. అచ్చంపేట వనపర్తి జిల్లాల పరిధిలో ఉండే కృష్ణానదిలో మరబోట్లను ఉపయోగించి మత్స్య కార్మికుల చేపల వేట కొనసాగేలా చర్యలు తీసుకుంటాం.. వనపర్తిలో త్రిబుల్ ఐటీ ద్వారా ఈ ప్రాంత విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్య అందిస్తాం. అచ్చంపేటలో 1.55 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి ఈ ప్రాంత కరువును పారదోలే విధంగా చర్యలు తీసుకుంటాం” అని 2018లో అచ్చంపేట, వనపర్తి పట్టణాల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ హామీ ఇచ్చారు. వీటిలో ఏ ఒక్కటీ అమలు కాలేదు. నేడు మళ్లీ అచ్చంపేట, వనపర్తి పట్టణాల్లో బహిరంగ సభల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నారు. ఈ సందర్భంగా ‘నవ తెలంగాణ’ ప్రత్యేక కథనం. ఐదు సంవత్సరాల కిందట 2018లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే నెలలో అచ్చంపేట, వనపర్తి పట్టణాల్లో జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో విశాలంగా ప్రవహిస్తున్న కృష్ణ, తుంగభద్ర నదులున్నాయి. వీటిని ఆధారంగా చేసుకొని శ్రీశైలం రిజర్వాయరును ఏర్పాటు చేశారు. శ్రీశైలంలో తెలంగాణకు వాటా ఉంది. అందుకే మర బోట్ల ద్వారా మత్స్య కార్మికులకు చేపలు పట్టేందుకు ఉపాధి కల్పిస్తామని సీఎం చెప్పారు. వేలాది మంది ప్రజల సాక్షిగా ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు.1.55 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. మద్దిమడుగు దగ్గర కృష్ణానదిపై బ్రిడ్జి ఏర్పాటు ద్వారా ఇతర రాష్ట్రాలకు వందల కిలోమీటర్ల దూరం తగ్గించే అవకాశాలు ఉంటాయన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో 10 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. 1000 ఎకరాల్లో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయమైన ప్యాకేజీని అందజేస్తామన్నారు. లింగాలలో 83 సర్వే నెంబర్‌లో పట్టాలు ఇవ్వడమే గాక 95 సర్వే నెంబర్‌లో అమ్రాబాద్ రైతులకు హక్కులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ నియోజకవర్గమైన అచ్చంపేటలో మెగా లెదర్ పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఈకో పార్కు ఏర్పాటు చేయడమేగాక అచ్చంపేట పట్టణంలో డిగ్రీ, పీజీ కళాశాలలు ఏర్పాటుచేసి ఉన్నత విద్యను అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. వనపర్తి బహిరంగ సభలో నిరుద్యోగులకు భృతి ఇస్తామనీ భరోసా ఇచ్చారు.
ఒక్కటీ అమలు కాలే..
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో చేపల వేట కోసం మర బోట్ల ఏర్పాటు ఊసే ఎత్తడం లేదు. మద్దిమడుగు నుంచి మార్చాలకు బ్రిడ్జి ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్‌లో అనేక వ్యాపార కార్యక్రమాలు కుటుంబ సంబంధాలకు అవకాశం ఉంటుంది. అదీ కార్యరూపం దాల్చలేదు.వనపర్తిలో కళాశాల ఏర్పాటు ఊసే మరిచారు. ముఖ్యమంత్రి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్లీ ఎన్నికల ప్రచారం కోసం జిల్లాకు రావడం పట్ల ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.