విద్యార్థులకు యూనిఫాం కష్టాలు

– బడులు మొదలై 3 నెలలైనా తప్పని తిప్పలు
– పుస్తకాల కోసమూ ఎదురు చూపులే
– యూపీలోని ప్రభుత్వ బడుల్లో ఇబ్బందులు
– యోగి సర్కారు తీరుపై చిన్నారుల తల్లిదండ్రుల ఆగ్రహం
లక్నో: యూపీలో ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు కష్టాలు తప్పటం లేదు. యూనిఫాం, పుస్తకాలు వారికి అందలేదు. గత మూడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులు యూనిఫాం లేకుండానే తరగతులకు హాజరవుతుండటం గమనార్హం. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రాథమిక పాఠశాలలకు కొత్త అకడమిక్‌ సెషన్‌ ఏప్రిల్‌ 1న ప్రారంభమైంది. అయినప్పటికీ, యోగి సర్కారు ప్రాథమిక పాఠశాలలు (1 నుండి 5 తరగతులు), ప్రాథమికోన్నత పాఠశాలల్లోని విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలకు డబ్బును బదిలీ చేయడంలో విఫలమైంది. ఇదిలా ఉంటే మొదటి టర్మ్‌ పరీక్షలు ఇంకా నెలరోజులు మాత్రమే ఉండటం గమనార్హం.ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల జాతీయ స్థాయి సంస్థ రాష్ట్రీయ షేక్‌శిక్‌ మహాసంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎం) జాతీయ ప్రతినిధి వీరేంద్ర మిశ్రా మాట్లాడుతూ.. ”ఈ పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వం పంపే డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ దాని గురించి ఎటువంటి సమాచారమూ లేదు” అని అన్నారు. 2021లో షర్టులు, ప్యాంటు (రెండు సెట్లు), స్వెటర్లు, షఉలు, సాక్స్‌లు, స్కూల్‌ బ్యాగ్‌తో సహా యూనిఫాంల కొనుగోలు కోసం విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలకు రూ.1,200 జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే నేటికీ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ బదిలీ కోసం ఎదురుచూస్తున్నారు. శీతాకాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు.. నిధుల కొరత కారణంగా స్వెటర్లు, బూట్లు, సాక్స్‌ లేకుండా తరగతులకు హాజరుకావలసి వస్తున్నది. రాష్ట్రంలోని ఈ పిల్లలలో ఎక్కువ మంది పేద కుటుంబాలకు చెందినవారే కావటం గమనార్హం. కాగా, రాష్ట్రంలోని లఖింపూర్‌, బహ్రైచ్‌, సీతాపూర్‌, బల్లియా, అజంగఢ్‌లతో సహా అనేక పాఠశాలలకు కొత్త సెట్‌ల పుస్తకాలు చేరలేదు. కొత్త పుస్తకాలు లేకపోవడంతో గతేడాది విద్యార్థులు ఇచ్చిన కొన్ని పాత పుస్తకాలను ఉపాధ్యాయులు వినియోగించుకుంటున్నా చాలా వరకు చిరిగిపోయాయి. కొత్తగా పాఠాలు బోధించడం ఇబ్బందిగా మారిందని ఉపాధ్యాయులు వెల్లడించారు. ప్రాథమిక విద్యా శాఖ రికార్డుల ప్రకారం.. యూపీలోని 1.58 లక్షల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సుమారు 1.87 కోట్ల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులకు పుస్తకాల పంపిణీ జరిగేలా చూడాలని ఆ శాఖ అధికారులు, ప్రచురణకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 30వ తేదీ వరకు గడువు విధించింది. అయితే గడువులోగా ప్రచురణకర్తలు విఫలమవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో యోగి సర్కారు నిర్లక్ష్య వైఖరిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love