నవతెలంగాణ ముంబయి : తెలంగాణలో ఏడాదిగా ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్ధాలతో నిత్యం ప్రజలను మోసం చేస్తోందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ముంబయిలో ఎన్నికల ప్రచారంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వచ్చి అబద్ధాలను చెప్పారన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆ తర్వాత ఎలా మోసం చేస్తోందో.. మహారాష్ట్ర ప్రజలకు వివరించేందుకు.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ముందుకు వచ్చానని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో 99% ఇంకా ప్రారంభంకాలేదని చెప్పారు. అన్ని వర్గాలకు వెన్నుపోటు రైతులు, మహిళలు, యువత, కార్మికులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాలకు రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని కిషన్‌రెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ జోడీ.. తెలంగాణ ప్రజలను ఎలా మోసం చేశారో.. అదే తరహాలో మహారాష్ట్ర ప్రజలను కూడా మభ్యపెట్టాలని చూస్తున్నారని, ఎవరూ నమ్మోద్దని చెప్పారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు.. కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారాయని, తెలంగానలో ఆర్ ఆర్ ట్యాక్స్ పేరుతో ప్రజల నడ్డీ విరుస్తున్నాయన్నారు. తెలంగాణలో పూర్తిగా అధికార దుర్వినియోగం జరుగుతోందని చెప్పారు. తెలంగాణలో గెలిచిన తర్వాత దేశంలో ఏ ఎన్నికలు జరిగినా.. తెలంగాణ సర్కారు నుంచి డబ్బులు తెచ్చి మిగిలిన చోట్ల ఖర్చుపెడుతున్నారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అభివృద్ధి చేసిందని భావిస్తే.. రాహుల్ గాంధీకి సవాల్ చేస్తున్నా.. ముంబై ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్ధమా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.