కేంద్ర మంత్రికి నీట్‌ సెగ

Union Minister NEET Sec– కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ అరవింద్‌ ఇండ్ల ముట్టడి
– విద్యార్థి, యువజన సంఘాల నాయకుల అరెస్ట్‌
– నిజామాబాద్‌లో విద్యార్థులపై లాఠీచార్జి
– మహబూబ్‌నగర్‌లో భారీ ప్రదర్శన
నవతెలంగాణ-అంబర్‌పేట/నిజామాబాద్‌ సిటీ
నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారం సెగ కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని, బీజేపీ ఎంపీ అరవింద్‌ను తాకింది. నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో శనివారం వారి ఇండ్లను ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు వాకిరి అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. అనంతరం నాయకులను అరెస్టు చేశారు. నిజామాబాద్‌లో ఎంపీ అరవింద్‌ ఇంటి ఎదుట విద్యార్థులను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అరెస్టు చేశారు. అలాగే, మహబూబ్‌నగర్‌లో పెద్దఎత్తున విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
హైదరాబాద్‌ కాచిగూడలోని కిషన్‌రెడ్డి ఇంటిని విద్యార్థులు, యువకులు ముట్టడించారు. కిషన్‌రెడ్డి డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. దాంతో పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి కోట రమేష్‌,అనగంటి వేంకటేష్‌ సహా మరికొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అశోక్‌ రెడ్డి, డీవైఎఫ్‌ఐ నగర కార్యదర్శి ఎండి.జావిద్‌, తెలంగాణ విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షులు మాసంపల్లి అరుణ్‌ కుమార్‌, పలువురు ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు ఉదయం కిషన్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీ, అవకతవకలపై ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. నీట్‌ పరీక్షను రద్దు చేయాలని, పరీక్షలను మళ్లీ నిర్వహించాలని కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలన్నారు. కిషన్‌ రెడ్డికి గనుల వేలం పాటపై ఉన్న శ్రద్ధ, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌పై లేకపోవడం సిగ్గుచేటన్నారు. నీట్‌ పేపర్‌ లీకేజీ అంశంపై ప్రధాని మోడీని ‘ఛారు పే చర్చా కార్యక్రమం’ నిర్వహించేలా కిషన్‌ రెడ్డి అడగాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అంబర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
విద్యార్థి సంఘాల నాయకులపై లాఠీచార్జ్‌
ఎన్‌టీఏను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో ఎంపీ అరవింద్‌ ఇంటిని ముట్టడించగా.. పోలీసులు లాఠీచార్జి చేశారు. విద్యార్థి సంఘాల నాయకులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అరెస్టు చేసి 3వ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన నీట్‌ పరీక్షలో స్కామ్‌ జరిగిందని, ఒకే పరీక్ష కేంద్రంలో 8 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. పరీక్ష పత్రం లీకేజీలో లక్షల రూపాయలు చేతులు మారాయని, లక్షలాది మంది జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 67 మందికి టాప్‌ ర్యాంకులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. మోడీ వెంటనే రాజీనామా చేయాలని, ఎన్‌టీఏను రద్దు చేయాలని, నీట్‌ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐపీఎస్‌యూ, ఎన్‌ఎస్‌యుఐ, ఏఐఎస్‌ఎఫ్‌ నేతలు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌లో కదం తొక్కిన విద్యార్థి లోకం
నీట్‌ పేపర్‌ లీకేజీపై సమగ్ర విచారణ జరిపించి పరీక్ష మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ సంఘాల ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి తెలంగాణ చౌరస్తా వరకు వందలాది మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాలో నిరసన తెలిపారు.
నీట్‌-2024, యూజీసీ నెట్‌ పరీక్షల అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పాలకేంద్రం వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
చనగాని నిరాహార దీక్ష
నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీ దోషులను శిక్షించాలని హైదరాబాద్‌లో ఓయూ డా.బిఆర్‌.అంబేద్కర్‌ లైబ్రెరీ ఎదుట టీపీసీసీ అధికార ప్రతినిధి, ఓయూ పీహెచ్‌డీ విద్యార్థి చనగాని దయాకర్‌ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూజీసీ నెట్‌ లీకేజీ అయిందని రద్దు చేశారు కానీ నీట్‌ను ఎందుకు రద్దు చేయరని ప్రశ్నించారు. నీట్‌ లీకేజీలో బీజేపీ ఎంపీల హస్తం ఉందని, విద్యార్థుల భవిష్యత్‌ కంటే లీకేజీరాయుళ్లు బీజేపీకి ముఖ్యమా? అని ప్రశ్నించారు. అనంతరం ఆయనకు ఓయూ అధ్యాపకులు ప్రొఫెసర్‌ కాసిం, ప్రొఫెసర్‌ కొండ నాగేశ్వరావు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

Spread the love