ఐక్య ఉద్యమాలే సింగరేణికి రక్ష

United movements are the savior of Singareni– వేలంపాట రద్దయ్యే దాకా పోరు ఆగదు
– తెలంగాణ బొగ్గుపై హక్కు సింగరేణికే
– ప్రయివేటు పరమైతే ప్రజలపై భారాలు
– విద్యుత్‌ చార్జీలు పెరిగే ప్రమాదం
– అన్ని కార్మిక సంఘాలు కలిసి పనిచేయాలి
– కార్మికులే కాదు ప్రజలూ పోరాటంలో భాగస్వాములు కావాలి
– వామపక్ష పార్టీలపై గురుతర బాధ్యత
– త్వరలో గవర్నర్‌, సీఎంను కలుస్తాం
– కేంద్రంపై ఒత్తిడికి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి : నవతెలంగాణతో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య
‘సింగరేణి సంస్థ పరిరక్షణకు ఐక్య ఉద్యమాలే రక్ష. తెలంగాణ బొగ్గుగనులపై సింగరేణికే హక్కు ఉంటుంది. ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినందుకు శ్రావణపల్లి బొగ్గుబ్లాకును వేలంపాట చేయడమే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన బహుమానం. బొగ్గుగనుల శాఖ మంత్రి తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి ఉన్నా వేలంపాట నిర్వహించడం, తెలంగాణకు అన్యాయం చేయడం దురదృష్టకరం. వేలంపాట రద్దయ్యేదాకా ఈ పోరాటం ఆగదు. సింగరేణి ప్రయివేటుపరం అయితే ప్రజలపై భారాలు పడతాయి. సింగరేణి ప్రాంతాల్లో సంక్షేమానికి నిధులు ఆగిపోతాయి. ఇప్పటిదాకా సింగరేణి ఉత్పత్తి చేస్తే బొగ్గు చౌకధరకు లభిస్తోంది. ప్రయివేటు సంస్థలు ఉత్పత్తి చేస్తే బొగ్గు పిరం అవుతుంది. అప్పుడు విద్యుత్‌ చార్జీలు పెరిగే ప్రమాదం లేకపోలేదు. అందుకే సింగరేణి సంస్థను పరిరక్షించుకునే బాధ్యత కార్మికులపైనే కాకుండా ప్రజలపైనా ఉన్నది. అందుకోసం జరిగే పోరాటంలో ప్రజలంతా భాగస్వాములు కావాలి. వామపక్ష పార్టీలపై సింగరేణిని కాపాడుకునే గురుతరమైన బాధ్యత ఉన్నది. వేలంపాటను రద్దు చేయాలనీ, తెలంగాణలోని బొగ్గుబ్లాకులను నేరుగా సింగరేణికే కేటాయించాలని కోరుతూ త్వరలోనే గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను కలుస్తాం. అమెరికా పర్యటన నుంచి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినీ కలుస్తాం. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి. ఈ బస్సుయాత్ర ఆరంభం మాత్రమే. ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి భవిష్యత్‌ కార్యాచరణను రూపొందిస్తాం.’అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య అన్నారు. ఇటీవల చేపట్టిన సింగరేణి పరిరక్షణ యాత్ర ముగిసిన నేపథ్యంలో ఆయన నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

ఈ సమస్యకున్న రాజకీయ ప్రాధాన్యతను వివరించండి?
‘బొగ్గుగని కార్మికులు, ఆ ప్రాంతంలోని ప్రజలంతా కాంగ్రెస్‌ లేదా బీజేపీకి ఓట్లేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు. ఫలితాలు వచ్చిన నెలరోజులకే సింగరేణికి ఇంత కష్టం వస్తుందని ఎవరూ ఊహించలేదు. బొగ్గు మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ వ్యక్తి అయినా, సింగరేణికి బీజేపీ ఇంత ద్రోహం చేస్తుందని అనుకోలేదంటున్నారు. ఇంకోవైపు వేలంపాటలో కిషన్‌రెడ్డి పక్కన ఉప ముఖ్యమంత్రి భట్టి కూర్చున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనాల్సింది కాదు. బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వేలంపాటపై ఒకే అభిప్రాయంతో ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి కొట్టగలమా అనే ప్రశ్న ప్రజల్లో ఉన్నది. 2021లో కోయగూడెం, సత్తుపల్లి బ్లాకులను ప్రయివేటువారికి అప్పగించారు. ఆ మూడు పార్టీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా దానికి అనుకూలం. వేలంపాటను వ్యతిరేకించే పార్టీలు వామపక్ష పార్టీలు మాత్రమే. సింగరేణిని పరిరక్షించాల్సిన బాధ్యత అ పార్టీలపైనే ఉన్నది. కార్మిక సంఘాలన్నీ ఐక్యం కావాలి.
గతనెల 29న యాత్ర చేపట్టాం. అదే రోజు కేంద్ర బొగ్గుగనుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కోయగూడెం, సత్తుపల్లి బొగ్గుబ్లాకుల్లో తవ్వకాలకు ఉన్న అడ్డంకులను తొలగించాలని చెప్పింది. రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినందుకు బీజేపీ ప్రజలకు ఇచ్చిన బహుమానం. ఆ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం లేదా సింగరేణి చేతిలో ఉన్న భూమిని ప్రయివేటు వారికి లీజుకివ్వాలి. దీంతో వారు బొగ్గు తవ్వకాలు ప్రారంభించొచ్చు. కోయగూడెం 1/70 చట్టం పరిధిలో ఉన్నది. ప్రభుత్వరంగ సంస్థ లేదా గిరిజనుల సొసైటీ తవ్వకాలు చేపట్టాలి. ప్రయివేటు వ్యక్తులు తవ్వకాలు చేపట్టకూడదు. న్యాయపరమైన అంశాలు ఏమైనా ఉంటే గిరిజన సంఘాలు ఆలోచించాలి.’అని వీరయ్య అన్నారు.
మీ ప్రధాన డిమాండ్లకు పునాది ఏమిటీ?
‘సింగరేణి సంస్థ సర్వే చేసి 15 ప్రాంతాల్లో కొత్త బొగ్గు బ్లాకులను గుర్తించింది. వాటిపై ఇప్పుడు సింగరేణికి హక్కులేదు. కేంద్రం వేలంపాట వేస్తున్నది. ప్రస్తుతం సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గుబ్లాకులు మూతపడతాయి. కొత్త బ్లాకులు ప్రయివేటు వారికి అప్పగిస్తారు. దీంతో సింగరేణి నష్టాలపాలవుతుంది. ఆ తర్వాత మూతపడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సింగరేణి ఏటా రూ.71 వేల కోట్లు డివిడెండ్‌, పన్నుల రూపంలో ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం, జెన్‌కో, ఎన్టీపీసీ వంటి సంస్థలు సింగరేణికి రూ.30 వేల కోట్లు బకాయి పడ్డాయి. అయినా సింగరేణి లాభాల్లో ఉన్నది. అందుకే ప్రయివేటు సంస్థల వారి కన్ను పడింది. స్వదేశీ, విదేశీ కార్పొరేట్‌ సంస్థలు బొగ్గుబ్లాకులను దక్కించుకుంటాయి. వీపరీతమైన లాభాలు పొందుతాయి.’అని వీరయ్య అన్నారు.
సింగరేణి కార్మికుల ఆదరణ మీ యాత్రకు ఎలా ఉన్నది?
‘గతనెల 29న బెల్లంపల్లిలో సింగరేణి పరిరక్షణ యాత్ర ప్రారంభించాం. ఈనెల ఐదున కొత్తగూడెంలో ముగిసింది. సింగరేణి కార్మికుల ఇండ్లలోనే బస చేశాం, వారి ఇండ్లలోనే భోజనం చేశాం. గెస్ట్‌ హౌజ్‌లు, లాడ్జీల్లో ఉండలేదు. దీంతో కార్మికులతోనే కాకుండా వారి కుటుంబాలతోనూ మమేకమయ్యాం. రాష్ట్ర నాయకులు ఇంటికి రావడంతో కార్మికులు సంతోషపడ్డారు. వారి ఆతిథ్యం వల్ల మాలో ఉత్సాహం పెరిగింది. వారి కష్టసుఖాలు తెలుసుకునేందుకు ఈ యాత్ర దోహదపడింది. ఈ యాత్ర ఎందుకు చేపట్టామో కార్మికులే కాకుండా కుటుంబాలు అర్థం చేసుకోవాలన్న లక్ష్యం నెరవేరింది. కార్మికుల సమస్యలు లోతుగా అధ్యయనం చేయడానికి ఉపయోగపడింది.
‘బొగ్గుగనుల వద్ద సమావేశాలను నిర్వహించాం. కొన్నిచోట్ల ఏఐటీయూసీ నాయకులు మమ్మల్ని కలిసి సంఘీభావం ప్రకటించారు. ఇలాంటి ఉద్యమాలు అవసరమన్నారు. ఓచోట ఐఎన్‌టీయూసీ నాయకులు మా బృందానికి స్నాక్స్‌ ఏర్పాటు చేశారు. ఉద్యమం బలపడాలని ఆకాంక్షించారు. గోదావరిఖనిలో సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ నాయకులు సంఘీభావం ప్రకటించారు.’అని వీరయ్య చెప్పారు.
కార్మికులకు మీరిచ్చే సందేశం ఏమిటీ?
‘సింగరేణి సంస్థలో 40 వేల మంది పర్మినెంట్‌, 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులున్నారు. కాంట్రాక్టీకరణ పెరిగింది. ఓపెన్‌ కాస్టు మైనింగ్‌లో వలస కార్మికులు బానిస చాకిరీ చేస్తున్నారు. పైకి ప్రభుత్వరంగ సంస్థ లోపల అంతా ప్రయివేటీకరణ. ఇంతకాలం దొడ్డిదారిన చేశారు. ఇప్పుడు నేరుగా ప్రయివేటీకరణ చేయడానికి కేంద్రం పూనుకున్నది. బొగ్గుగనులపై సింగరేణికి హక్కులేదని తేల్చింది. దీంతో సింగరేణికి బొగ్గుగనుల్లేకుంటే కార్మికులకు పని ఉండదు, ఆ సంస్థకు లాభాలుండవు, తర్వాత అది మూతపడుతుంది. ఇది ప్రమాదకరం. దీన్ని అడ్డుకోవాలి.
‘యువ కార్మికులు ఎంతో ఆందోళనలో ఉన్నారు. వారు రిటైర్‌ అయ్యేలోపు సింగరేణి సంస్థ ఉంటుందా? అన్న ప్రశ్న వారిని వేధిస్తున్నది. మా భవిష్యత్‌ ఏంటని ప్రశ్నిస్తున్నారు. సింగరేణి మూతపడితే మా కుటుంబాలు రోడ్డునపడతాయి. ఆ తర్వాత ఎలా బతకాలి. కార్మిక సంఘాలు కదలడంతోపాటు కుటుంబాలు, ప్రజలు పోరాటంలో భాగస్వాములు కావాలి.
‘సింగరేణి ప్రాంతాల్లో ఉద్యోగులకే కాకుండా ప్రజలకూ అభివృద్ధి ఫలాలు అందుతాయి. విద్యుత్‌ చార్జీలు తక్కువగా ఉంటాయి. రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు వంటి సౌకర్యాలకు సింగరేణి సంస్థ నిధులు కేటాయిస్తుంది. ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి గనులు పోతే విద్యుత్‌ చార్జీలు పెరుగుతాయి. అభివృద్ధి పనులకు నిధులుండవు. అందుకే ఆ సంస్థను ప్రజలు కాపాడుకోవాలి.’అని వీరయ్య సూచించారు.
మీ యాత్ర సత్ఫలితాలను ఇచ్చిందని భావిస్తున్నారా?
‘సరైన సమయంలో ఈ యాత్ర చేపట్టామన్న సంతృప్తి మాకు కలిగింది. కార్మికులు, ప్రజల్లో చైతన్యం పెంచడానికి ఉపయోగపడింది. వామపక్ష పార్టీలపై పెద్ద బాధ్యత ఉన్నదనే అభిప్రాయం ఎల్లెడలా వ్యక్తమైంది. వేలంపాట రద్దు కావాలనీ, తెలంగాణలోని బొగ్గు సింగరేణికే దక్కాలని వామపక్షాలే అంటాయి. వాటిమీద గురుతర బాధ్యత ఉన్నది. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలు కదలాలి. శ్రావణపల్లి బొగ్గుబ్లాకు వేలంపాటను రద్దు చేయాలి. 2021లో ప్రయివేటు వారికి అప్పగించిన కోయగూడెం, సత్తుపల్లి బ్లాకులను సింగరేణికే కేటాయించాలి. తెలంగాణలోని బొగ్గు నిక్షేపాలు సింగరేణికే హక్కు కల్పించాలి.’అని వీరయ్య డిమాండ్‌ చేశారు.
మీ భవిష్యత్‌ కార్యాచరణ ఎలా ఉండబోతుంది?
‘తెలంగాణ ప్రజలకు పోరాట చరిత్ర ఉన్నది. రానున్న కాలంలో ప్రజలను మరింత చైతన్యం చేయాలి. కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు కదలాలి. సింగరేణి పరిరక్షణ యాత్ర భవిష్యత్తులోనూ కొనసాగాలి. ఐక్య ఉద్యమాలకు దారితీయాలి. త్వరలోనే గవర్నర్‌ను కలుస్తాం. అమెరికా నుంచి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలుస్తాం. కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి. ఆ తర్వాత భవిష్యత్‌ కార్యాచరణను రూపొందిస్తాం.
ఈ నెల 29న యాత్ర మొదలైనప్పటి నుంచి కొత్తగూడెంలో ముగింపు వరకు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా బాగా సహకరించింది. కళాకారుల బృందం క్రమశిక్షణతో ఉండి ఆట,పాటలతో ప్రజలను చైతన్యపరిచింది. పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులందరూ కలిసి ఈ యాత్రను జయప్రదం చేశారు.’అని వీరయ్య అన్నారు.

Spread the love