ఉపా రద్దు కోసం ఐక్య పోరాటాలు

– తాడ్వాయి కుట్ర కేసును ఉపసంహరించుకోవాలి
– 146 మందిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి : సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘ఉపా చట్టాన్ని రద్దు చేయాలి. దేశద్రోహం, రాజ ద్రోహం, ఎన్‌ఐఏ చట్టాలను రద్దు చేయాలి. తాడ్వాయి కుట్ర కేసును ఉపసం హరించుకోవాలి.152 మందిపై కేసు నమోదు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురిపైన ఉన్న కేసుల్నే ఎందుకు ఉపసంహరించుకుంది. ప్రభుత్వం విభజించు- పాలించు అనే రకంగా కుట్ర చేస్తున్నది. అందువల్ల ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి’ అని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ‘పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్‌ వి.సంధ్య, 152మందిపై పెట్టిన తాడ్వాయి కుట్ర కేసును ఎత్తివేయాలి’ అనే అంశంపై సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఆ పార్టీ సహాయ కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్‌రావు అధ్యక్షతన హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ పార్టీలపై నిషేధం, నిర్బంధం సరైందికాదని అన్నారు. ఎర్రజెండాను బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఏమి చేయలేకపోయాయని గుర్తుచేశారు. మున్ముందు కూడా ఏమి చేయలేరని అన్నారు. కేసులు, జైళ్లు, నిర్బంధాలు ఎర్రజెండాలకు కొత్తేమికాదన్నారు. భీమాకోరేగావ్‌ కేసు దుర్మార్గమైందన్నారు. కుట్ర చేశారనే పేరుతో పూర్తి అంగవైకల్యం ఉన్న సాయిబాబాను జైళ్లో బంధించారని గుర్తుచేశారు. 152 మందిపై రాష్ట్ర ప్రభుత్వం ఉపా కేసు నమోదు చేయడం అన్యాయమని అన్నారు. బీజేపీకి తాను వ్యతిరేకమని గొప్పలు చెప్పిన కేసీఆర్‌ కూతరుపై కేసు పెట్టగానే ఢిల్లీకెళ్లారని గుర్తుచేశారు. మూడోసారి బీఆర్‌ఎస్‌ అధికారంలోకొస్తుందనే నమ్మకం కేసీఆర్‌కు లేదని, కర్ణాటక ఫలితాలు ఆయన్ను మరింత కలవరపెడుతున్నాయని అన్నారు. తాడ్వాయి కుట్ర కేసులోని 152 మందిలో కేవలం ఆరుగురిపై కేసును ఉపసంహరించుకోవడమేంటని ప్రశ్నించారు. ఉపా చట్టానికి వ్యతిరేకంగా అన్ని జిల్లాలో సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న మోడీ అమెరికాలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం శోచనీయమ న్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లురవి మాట్లాడుతూ రాజ్యాంగంలోని లౌకికవాదం, సౌమ్యవాదం అంశాలను పాఠ్యపుస్తకాల్లో తొలగిం చడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఉపా చట్టాన్ని రద్దు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాలమల్లేష్‌ మాట్లాడుతూ మాట, ఆట, పాటలపై నిర్బంధం కొత్తేమికాదన్నారు. ఇదే అంశంపై ఈనెల 27న తమ పార్టీ కార్యాలయంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ తాడ్వాయి కుట్ర కేసు అనేది 152 మంది సమస్య కాదని, తెలంగాణ అస్థిత్వ, హక్కులకు సంబంధించిన సమస్యగా గుర్తించాలని అన్నారు. ప్రశ్నించేవారిని భయపెట్టడానికి దేశవ్యాప్తంగా 25,200 మందిపై ఉపా కేసులు పెట్టారని, వీటిలో 2శాతం మందికి మాత్రమే శిక్షలు పడ్డాయని తెలిపారు. కానీ అందరిని జైళ్లలో పెట్టారని గుర్తుచేశారు. టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు కోదండరామ్‌ మాట్లాడుతూ ఉపా చట్టం అవసరంలేదని, అందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. అంతకుముందు సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు గోవర్ధన్‌ ఉపా చట్టం రద్దు, తాడ్వాయి కుట్ర కేసును ఉపసంహరించుకోవాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో ఆప్‌ తెలంగాణ కన్వీనర్‌ దిడ్డి సుధాకర్‌, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు విమలక్క, పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్‌ వి.సంధ్య, రిటైర్డ్‌ జడ్జి చంద్రకుమార్‌, ఎంసీపీఐ (యూ) రాష్ట్ర కార్యదర్శి రవి, ఎస్‌యూసీఐ రాష్ట్ర కార్యదర్శి మురహరి, ప్రజాపంథా రాష్ట్ర నాయకులు హన్మేష్‌, సీపీఐ(ఎంఎల్‌) రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు మహేష్‌, ఓపీడీఆర్‌ నాయకులు లక్ష్మి, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి కన్నెగంటి రవి, టీవీవీ రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య, ఓయూ ప్రొఫెసర్‌ సమున్నత, ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మన్‌, టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు అశోక్‌, సామాజిక కార్యకర్త సజయ, హైకోర్టు న్యాయవాది లింగన్న, ఆఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు, కేంద్రప్రభుత్వ గెజిటెడ్‌ అధికారుల సంఘం నాయకులు కృష్ణమోహన్‌, ఐఎఫ్‌టీయూ, పీవైఎల్‌, పీడీఎస్‌యూ, బీసీ సంఘం యువజన విభాగం, పౌరహక్కుల సంఘం, ప్రజాసంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love