– సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి
– ఈనెల 24న ఎన్‌పీడీసీఎల్ ముందు మహాధర్నా : సీఐటీయూ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి
నవతెలంగాణ-హనుమకొండ
ఎన్‌పీడీసీఎల్ పరిధిలో 2013 నుంచి అన్‌మ్యాన్ కార్మికులుగా పనిచేస్తున్న 1600 మందికి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, వారిని ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించాలని సీఐటీయూ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని పబ్లిక్ గార్డెన్‌లో జరిగిన అన్‌మ్యాన్ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్‌పీడీసీఎల్ కంపెనీ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 1600 మంది అన్‌మ్యాన్ కార్మికులు పనిచేస్తున్నారని చెప్పారు. వీరందరూ ఐటిఐ, డిప్లొమా పూర్తి చేసిన వారేనని, విద్యుత్ ఉద్యోగులు చిన్న, పెద్ద భేదం లేకుండా ప్రతి పనిలో అన్‌మ్యాన్ కార్మికులను ఉపయోగిస్తున్నారని అన్నారు. వీరితో స్తంభాలు ఎక్కడం, చెట్లు కొట్టడం, బిల్లుల రీడింగ్, డబ్బు బిల్లులు వసూలు , నాన్ స్లాబ్ మీటర్ రీడింగ్, 33/11 కేవీలలో సమస్యలను పరిష్కరించడం, ఫ్యూజులు వేయడం వంటి పనులు రాత్రీపగలు తేడా లేకుండా చేస్తున్నారన్నారు. వీరికి ఇచ్చే వేతనం తక్కువ.. చాకిరి మాత్రం ఎక్కువగా ఉందన్నారు. పనిచేసే సందర్భాల్లో అనేక మంది కార్మికులు ప్రమాదాల్లో చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అన్‌మ్యాన్ కార్మికులను వెంటనే ఆర్టిజన్లుగా గుర్తించి.. విద్యుత్ సంస్థలో ఉన్న ఖాళీల్లో విద్యార్హతలను బట్టి వీరికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న ఎన్పీడీసీఎల్ కార్యాలయం ముందు నిర్వహించనున్న మహాధర్నా కార్యక్రమానికి అన్‌మ్యాన్ కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.