మణిపూర్‌లో ఆగని హింస

మరో తొమ్మిది మంది మృతి.. మంత్రి ఇంటికి నిప్పు
ఇంఫాల్‌ : మణిపూర్‌లో జాతుల మధ్య హింసాకాండ కొనసాగుతూనే ఉంది. మంగళవారం రాత్రి జరిగిన హింసాత్మక సంఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని కాంగ్‌కోపీ జిల్లా ఐజిజంగ్‌ గ్రామంలో కాల్పులు, గృహదహనాలు వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కుకీల జనాభా అధికంగా ఉన్న ఈ గ్రామంలో రాత్రి 10.30 గంటలకు హింస చెలరేగింది. చనిపోయిన వారందరూ మైతీ తెగ వారే. వీరంతా స్థానిక వాలంటీర్లని పోలీసులు తెలిపారు. కాంగ్‌కోపీ, తూర్పు ఇంఫాల్‌ జిల్లాల సరిహద్దులో ఈ గ్రామం ఉంది. గత వారం రోజులుగా ఈ ప్రాంతంలో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ తమ వారు నివసిస్తున్న ప్రదేశాలను కాపాడుకునేందుకు సమీప ప్రాంతాలకు చెందిన మైతీలు అక్కడికి చేరుకున్నారు. దీంతో రెండు తెగల మధ్య ఘర్షణలు జరిగాయి. గాయపడిన పది మందిని ఆస్పత్రిలో చేర్చగా వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం కుకీ తెగకు చెందిన వారు మంగళవారం రాత్రి ఖామెన్‌లాక్‌లో బాంబులు విసిరారు. ఈ ప్రాంతంలోనే కుకీలు, మైతీల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. కాగా ఆ రాష్ట్రమంత్రి ఇంటికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.

Spread the love