ఆగని హింస

మణిపూర్‌లో అంబులెన్స్‌కు మెయిటీ గ్రూపు నిప్పు
ఏడేండ్ల బాలుడు, తల్లి, మరొక వ్యక్తి సజీవ దహనం
న్యూఢిల్లీ : మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఆగటం లేదు. నిరసనకారులు కొందరు అంబులెన్సుకు నిప్పుపెట్టడంతో ముగ్గురు సజీవ దహనమయ్యారు. దీంతో ఈ ఘటన ఇప్పుడు ఆందోళనను రేకెత్తిస్తున్నది. ఆందోళనలకు అడ్డుకట్ట వేయటంలో విఫలమవుతున్న బీజేపీ ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష నాయకులు, సామాజికవేత్తలు, పౌర సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. 2000 మంది మెయిటీ గ్రూపు ఆదివారం ఇంఫాల్‌ శివార్లలో పోలీసుల ముందు అంబులెన్సును తగలబెట్టింది. బుల్లెట్‌ గాయాలతో ఆస్పత్రికి తరలించబడుతున్న తరుణంలో ఏడేండ్ల బాలుడు, తల్లి, వారి బంధువు సజీవ దహనమయ్యారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మృతులను టోన్సింగ్‌ హాంగ్సింగ్‌ (7), అతని తల్లి మీనా హాంగ్సింగ్‌ (45) (ఈమె కుకీని వివాహం చేసుకున్న మెయిటీ క్రిస్టియన్‌), వారి బంధువు మెయిటీ క్రిస్టియన్‌ అయిన లిడియా లౌరెంబమ్‌ (37)గా గుర్తించారు.
అనేక మంది కుకీలు బస చేసిన అస్సాం రైఫిల్స్‌ క్యాంపులోనే వారు(మృతులు) ఆశ్రయం పొందుతున్నారు. ఇది (క్యాంపు) ఇంఫాల్‌కు పశ్చిమాన 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న కాంగ్‌చుప్‌లో ఉన్నది. అయితే ఆదివారం సాయంత్రం నిరసనకారులు జరిపిన కాల్పుల్లో టోన్సింగ్‌కు బుల్లెట్‌ గాయమైంది. దీంతో పోలీసుల భద్రత నడుమ అంబులెన్సులో ఆస్పత్రికి వెళ్తున్న క్రమంలో మెయిటీ గ్రూపు వాహనాన్ని అడ్డుకున్నది. నిప్పంటించి దారుణానికి తెగబడింది. ”మే 3 నుంచి మేము అనేక వేధింపులను ఎదుర్కొంటున్నాము. కానీ, ఆదివారం నాటి ఘటన దారుణం” అని మృతుల బంధువుల్లో ఒకరైన పోలెన్‌లాల్‌ హాంగ్సింగ్‌ అన్నారు. ”శరీరాలు కాలిపోయాయి. బూడిదలో కొన్ని ఎముకలు మాత్రమే కనిపించాయి” అని పావోలెన్‌లాల్‌ అనే పాఠశాల ఉపాధ్యాయుడు చెప్పారు. పోలీసులెవరూ తనను సంప్రదించలేదనీ, తాను పోలీసు స్టేషన్‌కు వెళ్లడానికి భయపడుతు న్నానని అంబులెన్స్‌ దాడిలో తన కొడుకు, భార్యను కోల్పోయిన జాషువా హాంగ్సింగ్‌ తెలిపారు. ఎస్పీ ఎదుటే అంబులెన్సుకు నిప్పంటిం చారనీ, ముగ్గురు వ్యక్తులు మరణించారని తమకు తెలిసిందని అస్సాం రైఫిల్స్‌, ఆర్‌ఏఎఫ్‌ వర్గాలు తెలిపాయి.

అమిత్‌ షా ఇంటి వద్ద నిరసన ‘సేవ్‌ కుకీ లైవ్స్‌’ సందేశాలతో ప్లకార్డుల ప్రదర్శన
న్యూఢిల్లీ : మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండకు వ్యతిరేకంగా కుకీ కమ్యూనిటీకి చెందిన ప్రజలు దేశరాజ ధాని న్యూఢిల్లీలోని కేంద్ర అమిత్‌ షా ఇంటి వద్ద నిరసన హోం మంత్రి అమిత్‌ షా నివాసం బయట నిరసన ప్రదర్శనను నిర్వహించారు. ‘సేవ్‌ కుకీ లైవ్స్‌(కుకీల ప్రాణాలను కాపాడండి)’ అనే సందేశాలతో కూడిన ప్లకార్డులను వారు ప్రదర్శించారు. నినాదాలు వినిపిం చారు. అయితే, ఆందోళనకారుల్లో నలుగురిని సమావేశం కోసం హోం మంత్రి నివాసంలోకి అనుమతించారు. మిగతావారిని జంతరమంతర్‌కు తరలించారు. కాగా మణిపూర్‌లో చెలరేగిన హింస కారణంగా ఇప్పటి వరకు దాదాపు 98 మంది మరణించగా, 310 మందికి పైగా గాయప డ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 37,450 మంది ఆశ్రయం పొందుతున్నారు.

Spread the love