పత్తాలేని స్పెషల్‌ ఆఫీసర్లు

– ఖాళీగా గ్రామ పంచాయతీల ఖాతాలు
– పంచాయతీ నిర్వహణకు ఇబ్బందులు
– అప్పుల ఊబిలో పంచాయతీ కార్యదర్శులు
– కార్యదర్శులపై పని భారం
నవతెలంగాణ-జూలూరుపాడు
ఈ ఏడాది జనవరి 31వ తేదీతో సర్పంచుల పదవీకాలం ముగిసింది. ఫిబ్రవరిలో ప్రత్యేకాధికారుల పాలన మొదలైంది. వివిధ శాఖలకు చెందిన వారిని స్పెషల్‌ ఆఫీసర్లుగా ప్రభుత్వం నియమించింది. వారిలో కొందరికి గ్రామ పాలనపై ఎలాంటి అవగాహన లేక పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వారికి గ్రామ పాలన, నిధుల విషయంలో స్పష్టత లేకపోవడంతో గ్రామ పాలన పడకేసింది. దీంతో గ్రామ పంచాయతీల ఖాతాలు ఖాళీ అయ్యాయి. కనీసం కరెంట్‌ బిల్లులు, బోరు మరమ్మతులు, ట్రాక్టర్లకు డీజిల్‌ కొనలేని పరిస్థితులు నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్నాయి. సర్పంచుల పదవీకాలం ముగియడంతో స్పెషల్‌ ఆఫీసర్ల చేతుల్లోకి గ్రామ పాలన వెళ్లింది. వారికి నిధులు, విధులపై స్పష్టత లేక.. రావడం, పోవడం తప్పా ప్రత్యేకాధికారులు చేసిందేమీ లేక కార్యదర్శులకే పని భారమౌతోంది. ఆర్థిక పరమైన సమస్య వచ్చినప్పుడు స్పెషల్‌ ఆఫీసర్లు చేతులెత్తేయడంతో అప్పులు చేసి మరీ కనీస అవసరాలు తీర్చేందుకు పంచాయతీ కార్యదర్శులు నానా తంటాలు పడుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి గ్రామ పాలనను కొనసాగిస్తున్నారు. గ్రామ సిబ్బందికి నెలల కొద్దీ జీతాలు రాకపోవడంతో సొంతంగా డబ్బులు ఇచ్చి ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు తీసుకునే పరిస్థితి నెలకొన్నదని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ధిక భారం పంచాయతీ కార్యదర్యులపై పడుతోందని, ప్రభుత్వం సమయానికి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
సమయానికి నిధులు రాక…
15 వ ఆర్థిక సంఘం, స్టేట్‌ ఫైనాన్స్‌ ఇచ్చే నిధులు, పన్నుల వసూళ్లు పంచాయతీలకు ముఖ్యమైన ఆర్ధిక వనరులు. చాలా కాలంగా ఎస్‌ఎఫ్సీ (స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌) నిధులు రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం నేరుగా జనాభాకు అనుగుణంగా పంచాయతీకి ఇచ్చే నిధులు ప్రత్యేకపాలన ప్రారంభమైనప్పటి నుంచి రావడం లేదు. పన్ను వసూళ్లు అవుతున్నా ఖర్చులు పెరగడంతో మెయింటెనెస్స్‌ తప్పా మిగులు ఏమీ ఉండడం లేదు. ఇక మాకేం సంబంధం లేదన్నట్లుగా స్పెషల్‌ ఆఫీసర్లు కనీసం పంచాయతీల వైపు కన్నెత్తి చూడకపోవడంతో పంచాయతీ కార్యదర్శులపై ఆర్థిక, పని బారం పడుతుంది. ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేస్తే ఉత్సాహంగా పని చేసుకుంటామని కార్యదర్శులు అంటున్నారు.

Spread the love