– ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్
లక్నో : ఉత్తరప్రదేశ్లోని ఓటర్లు తెలివైనవాళ్లు అని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షులు అఖిలేశ్ యాదవ్ ప్రశంసించారు. రాష్ట్రంలో ఇండియా వేదిక సాధించిన విజయం వెనుకబడిన తరగతులు, దళితులు, మైనార్టీల (పీడీఏ) యొక్క విజయని అన్నారు. ప్రజాశక్తి కంటే ఏమార్చే రాజకీయం పనిచేయదని ఓటర్లు నిరూపించారన్నారు. ‘ప్రియమైన ఉత్తరప్రదేశ్లోని తెలివైన ఓటర్లు.. రాష్ట్రంలో ఇండియా వేదిక విజయం నిర్లక్ష్యానికి, దోపిడీకి, అణిచివేతకు గురైన దళిత, బహుజనలు, వెనుకబడిన, మైనార్టీ, గిరిజన, జనాభాలో సగం (మహిళలు), ఆగ్ర వర్ణాలతో పేదల యొక్క విజయం. సమానత్వ హక్కు, గౌరవం, ఆత్మ-గౌరవం, గౌరవప్రదమైన జీవితం, రిజర్వేషన్ల హక్కు కల్పించే రాజ్యాంగాన్ని కాపాడ్డం కోసం భుజం భుజం కలిపి పోరాడారు’ అని అఖిలేశ్ యాదవ్ సోషల్ మీడియాలో పోస్తు చేశారు. రైతులు, కార్మికులు, వ్యాపారుల కొత్త ఆశల విజయమని కూడా అన్నారు.