– సంజౌలీ మసీదుతో బీజేపీ మత చిచ్చు
– పట్టణ ప్రణాళికను ఆయుధంగా వాడుకుంటున్న తీరు
– హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ ప్రయోజనాల కోసం చిచ్చు రేపుతున్న వైనం
సిమ్లా: ప్రశాంతంగా ఉండే హిమాలయ రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ మత చిచ్చు రేపుతున్నది. ఇందుకు సిమ్లాలోని సంజౌలీ మసీదు అక్రమ కట్టడమంటూ ఇతర హిందూత్వ సంస్థలతో ఆందోళనలు చేస్తున్నది. ఇందుకు రాష్ట్రంలో ఒక విధానమంటూ లేని పట్టణ ప్రణాళికను కాషాయపార్టీ ఆయుధంగా వాడుకుంటున్నది. మసీదు విషయంలో మత చిచ్చు రేపి రాజకీయ ప్రయోజనాలను పొందాలనే దురుద్దేశం బీజేపీ చర్యల్లో కనిపిస్తున్నదని అక్కడి రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు అంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. డిసెంబర్ 2022 నుంచి హిమాచల్‌ప్రదేశ్‌ను పాలిస్తున్నది. అంతక ముందు, ఇక్కడ బీజేపీ అధికారంలో ఉన్నది. 2017 నుంచి 2022 వరకు కాషాయపార్టీ రాష్ట్రాన్ని పరిపాలించింది. మసీదుకు సంబంధించిన అక్రమ నిర్మాణ భాగాలకు పట్టణ ప్రణాళికను కారణంగా బీజేపీ, దాని అనుబంధ హిందూత్వ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, రాష్ట్రంలో గత ఐదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ఎందుకు తీసుకురాలేపోయిందని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా, మసీదు విషయంలో హిందూత్వ రంగును పులిమి రాజకీయంగా లబ్ది పొందాలన్న తపన బీజేపీలో ఎక్కువగా కనిపిస్తున్నదని వారు అంటున్నారు. ఇందులో భాగంగానే ద్వేషపూరిత రాజకీయాలకు ఆ పార్టీ తెరలేపిందని చెప్తున్నారు.
ప్రశాంతంగా ఉండే రాష్ట్ర రాజధాని సిమ్లాలో రాజకీయ ముఖచిత్రానికి కొత్త రంగులు అద్దాలని బీజేపీ భావిస్తున్నది. చల్లటి వాతావరణాన్ని కలిగి ఉండే ఈ పట్టణాన్ని, కొత్త రాజకీయ సమీకరణాలతో వేడిని పుట్టించాలని కాషాయపార్టీ ప్రయత్నిస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు. 1971లో పంజాబ్ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఒక సరైన పట్టణ ప్రణాళిక లేదనీ, పలు సందర్భాలలో కొన్ని చట్టాలు తీసుకొచ్చినా అవేవీ సమర్థవంతంగా పని చేయలేదని చెప్తున్నారు. ఈ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు పెరిగిపోయాయనీ, ఇందులో సిమ్లాలోనే అధికంగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
సిమ్లా డెవలప్‌మెంట్ ప్లాన్‌కు తుది రూపం ఇవ్వటంలో పలు ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అక్రమ నిర్మాణాల విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరించాయి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసంమే పలు ప్రభుత్వాలు సిమ్లా ప్రయోజనాలను తాకట్టు పెట్టాయని విశ్లేషకులు అంటున్నారు. సిమ్లా అనేది ఒక మునిసిపల్ కార్పొరేషన్. నిధులు, వనరులు అధికంగా వచ్చే సిమ్లాకు ప్రభుత్వాలు సరైనా న్యాయాన్ని మాత్రం చేయలేకపోయాయని చెప్తున్నారు.సిమ్లా ప్లానింగ్ ఏరియాలో కొత్త నిర్మాణాలు, కట్టడాల ఎత్తులను నిసేధిస్తూ 2017లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను జారీ చేసింది. 2022 వరకు రాష్ట్రంలో ఉన్న బీజేపీ మాత్రం వీటిని అమలు చేయలేదు. రాష్ట్రంలో అనధికార, అక్రమ కట్టడాలు పెరిగిపోయాయి. కొన్ని నివేదికల సమాచారం ప్రకారం రాష్ట్రంలో 25వేల అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ఇందులో సగం వరకు ఒక్క సిమ్లాలోనే ఉండటం గమనార్హం.