వాడిన కమలం

కర్నాటక కాంగ్రెస్‌దే
136 స్థానాలతో జయభేరి
12 మంది మంత్రుల ఓటమి
 31 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ  జేడీ (ఎస్‌) ఆశలు గల్లంతు
 ‘గాలి’కి కొట్టుకుపోయిన కేఆర్‌పీపీ  నేడు కేసీఎల్‌పీ భేటీ
బీజేపీ విద్వేష రాజకీయాన్ని కన్నడ ఓటర్లు తిరస్కరించారు. కర్నాటకలో హిందుత్వ పేరుతో ఆపార్టీ చేసిన వికృత చేష్టలను బ్యాలెట్‌ బాక్సుల తీర్పు ద్వారా కన్నడిగులు తిప్పికొట్టారు. గడచిన 34 ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్‌కు పూర్తిస్థాయి మెజారిటీ ఇచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. కేవలం వ్యక్తి పూజతో మోడీని ఆకాశానికెత్తి ఓట్లు దండుకోవాలనే ఆర్‌ఎస్‌ఎస్‌ ఆలోచనల్ని కర్నాటక ఓటరు పట్టించుకోలేదు. ప్రధాని మోడీ చరిష్మా కరిగిపోయిందని ఈ ఎన్నికలతో తేలిపోయింది. కర్నాటకలో మరోసారి విజయం సాధించి, క్రమంగా దక్షిణాదిని ఆక్రమించాలనే మోడీ, అమిత్‌షా ద్వయం ఆశలు ఆవిరయ్యాయి.
2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ కన్నడ తీర్పు పునరావృతం అవుతుందంటూ కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షపార్టీలు అంచనా వేస్తున్నాయి.ఈ ఫలితాలతో దేశ రాజకీయాల్లో అనేక మార్పులు సంభవించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ హిమాచల్‌ ప్రదేశ్‌లో సాధించిన విజయానికి ఇది కొనసాగింపు మాత్రమే. ఈ ఎన్నికల ప్రభావం కచ్చితంగా తెలంగాణ రాజకీయాలపైనా ఉంటుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఇక్కడ పాగా వేయాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఓటర్లు సమర్ధవంతంగా తిప్పికొడతారనే భరోసాను అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యక్తం చేసింది బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమనే సంకేతాలను కర్నాటక ఫలితాలు వెల్లడించాయని కాంగ్రెస్‌ స్పష్టం చేస్తున్నది. ఏదేమైనా కన్నడిగుల తీర్పు దేశ రాజకీయాలను గట్టిగానే ప్రభావితం చేస్తుంది. అయితే ఈ ఓటమిని సహించలేని బీజేపీ ప్రజల్ని చీల్చేందుకు మరిన్ని ప్రమాదకర నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు లేకపోలేదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
విద్వేష రాజకీయాలను తిప్పికొట్టారు : రాహుల్‌ గాంధీ
విద్వేష రాజకీయాలను కర్నాటక ప్రజలు తిప్పి కొట్టారని కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ అన్నారు. కర్నాటక ఫలితాలే అన్ని రాష్ట్రాల్లో రిపీట్‌ అవుతాయని చెప్పారు. ఇది బలవంతులపై బలహీనుల విజయమని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మొదటి రోజే అమలు చేస్తామన్నారు. ఎన్నికల్లో తాము ప్రేమతో పోటీ చేశాం తప్ప.. ద్వేషంతో కాదని పేర్కొన్నారు. కర్నాటక ప్రజలకు, గెలుపు కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు రాహుల్‌ గాంధీ ధన్యవాదాలు తెలిపారు.
నిర్ణయాత్మక తీర్పు ! : సీపీఐ(ఎం)
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని రాష్ట్ర ప్రజలు నిర్ణయాత్మకంగా తిరస్కరించారని, బీజేపీ ప్రభుత్వం పాల్పడిన దారుణమైన అవినీతి, అసమర్ధపాలన తాలుకూ ఫలితం ఈ ఓటమి అని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో విమర్శించింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోడీ నేతృత్వంలో సాగిన తీవ్రమైన మత ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారని ఈ తీర్పు రుజువు చేసింది. ప్రభుత్వం పట్ల తీవ్రంగా వున్న వ్యతిరేకత కాంగ్రెస్‌కు బాగా కలిసి రాగా, అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిందని పేర్కొంది. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన తీర్పునిచ్చిన కర్ణాటక ప్రజలను పొలిట్‌బ్యూరో అభినందించింది.
కాంగ్రెస్‌కు ఇది భారీ విజయం : సిద్ధరామయ్య
కర్నాటక ఎన్నిలక ఫలితాలు కాంగ్రెస్‌కు ఒక పెద్ద విజయమని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ అగ్రనాయకులు సిద్ధరామయ్య అన్నారు. ఇది ప్రధాని మోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జె.పి నడ్డాకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు అని తెలిపారు. నేడు(ఆదివారం) కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ మీటింగ్‌ ఉంటుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ 130 సీట్లు సాధిస్తుందని తాను అంచనా వేశాననీ, ఆ మార్కును పార్టీ చేరుకున్నదని అన్నారు. ” ఈ ఎన్నికలు కీలకమైనవి. ఈ ఫలితం లోక్‌సభ ఎన్నికలకు గీటురాయి. బీజేపీని ఓడించేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తాయని ఆశిస్తున్నాను. రాహుల్‌ గాంధీ కూడా ఈ దేశానికి ప్రధాని అవుతారని నేను ఆశిస్తున్నాను” అని సిద్ధరామయ్య అన్నారు.
బెంగళూరు : కర్నాటకలో ‘కమలం’ వాడిపోయింది. మోడీ గారడీలు, ఆ పార్టీ కుటిల యత్నాలు ఏవీ పని చేయలేదు. ఎన్నికలలో మరోసారి విజయం సాధించి దక్షిణాదిలో బలోపేతానికి పునాదులు వేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటర్లు మాత్రం అవినీతి ఊబిలో కూరుకుపోయిన బీజేపిని చావుదెబ్బ కొట్టి విలక్షణమైన తీర్పు ఇచ్చారు. ప్రజలు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఫలితాల సరళి స్పష్టం చేస్తున్నా ఆశ చావని కమలనాథులు జేడీ (ఎస్‌) నేత కుమారస్వామితో మంత నాలు మొద లెట్టారు. హంగ్‌ ఏర్పడితే సంకీర్ణ ప్రభు త్వాన్ని ఏర్పాటు చేయొచ్చన్న అత్యాశతో ‘ప్లాన్‌ బీ’ అమలుకు ప్రయత్నాలు జరిపారు. అయితే చివరికి కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ లభించడంతో బీజేపీ నేతలు నిరాశానిస్పృహలలో మునిగిపో యారు. కర్నాటక పట్టణ ప్రాంతాలలో బీజేపీ తన పట్టును కొంతమేర నిలుపు కున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల ప్రజానీకం మాత్రం కాంగ్రెస్‌కే జై కొట్టారు. 1990 తర్వాత ఏ పార్టీకీ ఇవ్వనంత మెజారిటీ ఇచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. ‘కింగ్‌ మేకర్‌ కాదు. మేమే కింగ్‌ అవుతాము’ అంటూ బీరాలు పలికిన జేడీ (ఎస్‌) నేత కుమారస్వామి ఆశలు అడియాసల య్యాయి. ఆ పార్టీ ప్రస్తుతం ఉన్న స్థానాలను కూడా కోల్పోయింది. కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ సైతం ఓటమి చెందారు. ఆ పార్టీ ఓటుబ్యాంకును కాంగ్రెస్‌ భారీగా కొల్లగొట్టింది. ఆ పార్టీకి ఏకంగా 139 సీట్లలో డిపాజిట్లు దక్కలేదు. మరోవైపు బళ్లారి ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని యత్నించిన గాలి జనార్ధనరెడ్డికీ ఆశాభంగం తప్పలేదు. ఆయన మినహా ఆయన ఏర్పాటు చేసిన పార్టీ కేఆర్‌పీపీలో ఒక్కరూ గెలవలేదు. చివరికి గాలి సతీమణి కూడా ఓడిపోయారు. ఒక్క కోస్తా ప్రాంతంలో మినహా బీజేపీ ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. పైగా ఆ పార్టీ 31 స్థానాలలో ధరావతులు కోల్పోయింది. కర్నాటక ఎన్నికలలో బరిలో దిగిన అమ్‌ఆద్మీ పార్టీ ఒక్క సీటూ దక్కించుకోలేక చతికిలపడింది. ఆ పార్టీకి 209 సీట్లలో డిపాజిట్లు గల్లంతయ్యాయి. శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు కర్నాటక పీసీసీ నేడు సమావేశం అవుతుంది.
హంగ్‌ అసెంబ్లీ ఏర్పడుతుందంటూ ఎగ్జిట్‌పోల్స్‌ వేసిన అంచనాలను తలకిందులు చేస్తూ కర్నాటకలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మెజారిటీ సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్నాటకలో కాంగ్రెస్‌ 136 సీట్లు సాధించి తిరుగులేని ఆధిక్యాన్ని కనబరచింది. బీజేపీ 65 స్థానాలకే పరిమితమైంది. జేడీ (ఎస్‌)కు 19, ఇతరులకు నాలుగు సీట్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా చూస్తే హైదరాబాద్‌ కర్నాటకలో కాంగ్రెస్‌కు 19, బీజేపీకి 9 స్థానాలు లభించాయి. పాత మైసూర్‌లో కాంగ్రెస్‌కు 34, బీజేపీకి 5 సీట్లు వచ్చాయి. ఆ ప్రాంతంపై గంపెడాశలు పెట్టుకున్న జేడీ (ఎస్‌) 14 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ముంబయి కర్నాటక ప్రాంతంలో కాంగ్రెస్‌కు 33, బీజేపీకి 16 సీట్లు రాగా మధ్య కర్నాటకలో కాంగ్రెస్‌కు 26, బీజేపీకి 6 స్థానాలు దక్కాయి. ఒక్క కోస్తా కర్నాటక ప్రాంతంలో మాత్రం బీజేపీ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. అక్కడ బీజేపీకి 12 సీట్లు రాగా కాంగ్రెస్‌కు 8 సీట్లు లభించాయి. గ్రేటర్‌ బెంగళూరులో రెండు పార్టీలకూ చెరో 16 స్థానాలు వచ్చాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలలో బీజేపీ ఓట్ల శాతంలో (35.9%) పెద్దగా మార్పు రానప్పటికీ సీట్లను మాత్రం భారీగా కోల్పోయింది. మరోవైపు జేడీ (ఎస్‌) కోల్పోయిన ఐదు శాతం ఓట్లను కాంగ్రెస్‌ తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్‌కు 43% ఓట్లు, జేడీ (ఎస్‌)కు 13.3% ఓట్లు లభించాయి. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ 40, జేడీ (ఎస్‌) 17 సీట్లు కోల్పోయాయి. బసవరాజ్‌ బొమ్మై కేబినెట్‌లోని 12 మంది మంత్రులు పరాజయం పాలయ్యారు. మంత్రి సోమన్న తాను పోటీ చేసిన రెండు స్థానాలలోనూ ఓడిపోయారు.
మోడీకి ప్రజలు బుద్ధి చెప్పారు..
కేంద్రంలో మోడీ ప్రభుత్వ దుర్మార్గపూరిత చర్యలకు కర్నాటక ప్రజలు తగిన బుద్ధి చెప్పారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ అవినీతికి ఆలవాలంగా నిలిచిందన్నారు. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ నిధులు 40 శాతం పక్కదోవ పట్టడంతో ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారన్నారు. కర్నాటక ఎన్నికల్లో మోడీ ప్రచారంలో భాగంగా ‘జై భజరంగబలి’ అంటూ నినాదాలు ఇస్తూ మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయాలనే కుట్రపూరిత చర్యలకు పాల్పడటాన్ని ఖండించారు.

Spread the love