నవతెలంగాణ ఢిల్లీ: తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో సోమవారం రాత్రే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్తలు వెలువడ్డాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం జరిగినా.. పార్టీలో సీనియర్ నేతలు భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి కూడా ఆ పోస్టు కోసం పోటీపడడంతో ముఖ్యమంత్రి ఎంపిక వాయిదా పడింది. కాగా, ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. హైకమాండ్ పెద్దలను కలిసి మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎంపీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆయన రాజీనామా చేయనున్నట్టు సమాచారం. ఈ మధ్యాహ్నం మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ సీఎం, ఉప ముఖ్యమంత్రి అభ్యర్థుల ఖరారు తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాసేపట్లో లోకసభ స్పీకర్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవనున్నారు. నిబంధనలకు అనుగుణంగా ఎమ్మెల్యేగా పదవీ ప్రమాణం చేసే ముందు లోకసభ సభ్యత్వానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా సమర్పించనున్నారు.