
నవతెలంగాణ హైదరాబాద్: తాను బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోందని టీపీసీసీ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌లో కీలక పదవిలో ఉన్న ఓ నేతే తనపై ఇలాంటి దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో తన స్థానాన్ని తగ్గించేందుకు ఇలాంటి ప్రచారం చేయడం సరి కాదన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. తన సహచరులు, అనుచరులను అణగదొక్కేందుకే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిణామాలతో అసంతృప్తిగా ఉండొచ్చు.. అయినప్పటికీ పార్టీ అంతర్గత విషయాలపై ఫోరమ్‌లలో తప్ప మీడియాతో మాట్లాడనని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి వ్యాపారాలు, ఒప్పందాలు, భూ లావాదేవీలు లేవని ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.