వ్యాక్సిన్‌ వ్యధలు

– మయోసైటిస్‌ బారిన భద్రాద్రివాసి
– కదల్లేని బలహీనత.. కండరాల నొప్పులతో అవస్థ
– ప్రాణాపాయ స్థితిలో రూ.70 లక్షల ఖర్చుతో వైద్యం
– 14 నెలలుగా ఇల్లూవాకిలి వదిలి ఆస్పత్రిలోనే..
– తిరగలేక హైదరాబాద్‌లోనే అద్దె గదిలో నివాసం
– అప్పులపాలై భూములు, ఇల్లు అమ్ముకున్న దైన్యం
– ఫార్మాకంపెనీలతో కేంద్రం కుమ్మక్కుతోనే
– తమకీ కష్టాలంటున్న బాధితుడు వెంకటరెడ్డి
– ఠాగూర్‌ సినిమా తరహాలో కార్పొరేట్‌ వైద్యులు
కరోనా వ్యాక్సిన్‌లు అక్కడక్కడా వికటించాయనే ఆరోపణలు ఉన్నాయి.. తదనంతరం వీటివల్ల కొన్ని ప్రాణాంతక వ్యాధులు వస్తున్నట్టు.. కొందరు చనిపోయినట్టూ వార్తలు వింటున్నాం. ఈ నేపథ్యంలో భద్రాచలానికి చెందిన కొల్లు వెంకటరెడ్డి అనే రైతు కూడా ఈ వ్యాక్సిన్‌ కారణంగా 14 నెలలుగా అవస్థ పడుతున్నారు. తీవ్రమైన కండరాల నొప్పులు.. కదల్లేని స్థితి.. కిలో బరువు కూడా ఉండని చిన్న వస్తువును సైతం కదపలేనంతటి బలహీనతకు ఆయన లోనయ్యాడు. మోకాళ్ల నొప్పులు.. కీళ్ల నొప్పులు… కాళ్లూ చేతులు లాగటం.. నీరసం.. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న తనకు ఉన్నట్టుండి వచ్చిన రోగమేంటో తెలియని స్థితిలో అతను పడిన బాధలు వర్ణనాతీతం. డాక్టర్లను సంప్రదిస్తే పరీక్షించి ప్లేట్‌లెట్లు పడిపోయాయేమోనని అన్నారు. కానీ రోజురోజుకూ ఆరోగ్య పరిస్థితి మరింత విషమిస్తుండటం.. రక్తకణాలు తగ్గడం.. బరువు కోల్పోవటం.. నీరసం ఆవరించి కదల్లేని స్థితికి చేరడంతో కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని ఓ ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఆ కార్పొరేట్‌ ఆస్పత్రి వైద్యులు పరీక్షించి.. రూ.30 లక్షల ఖర్చు వస్తుందని, అప్పటికప్పుడు రూ.18 లక్షలు చెల్లిస్తే ట్రీట్‌మెంట్‌ మొదలు పెడతామని చెప్పారు. ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు ఆ మొత్తం చెల్లించారు. రకరకాల పరీక్షలు చేశారు. ముందు క్యాన్సర్‌ అన్నారు.. మళ్లీ మరో జబ్బు అంటూ ట్రీట్‌మెంట్‌ చేశారు. నీరసానికి తోడు నోట్లో కురుపులవడంతో మాట్లాడలేని స్థితిలో ఉన్న బాధితుడు వెంకటరెడ్డిని ఐసీయూలో 23 రోజులపాటు ఉంచారు. కదల్లేని.. మాట్లాడలేని.. చూడటం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉన్న అతని ఆరోగ్య స్థితిగతుల్లో ఎలాంటి పురోగతీ లేకపోగా 24 కేజీల బరువు తగ్గి మరింత నీరసించాడు. ప్రస్తుతం నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
పూణే ల్యాబ్‌లో మయోసైటిస్‌గా నిర్ధారణ
నిమ్స్‌కు తరలించాక అక్కడి వైద్యులు మరోసారి పరీక్షలు నిర్వహించారు. కోవిషీల్డ్‌ వాగ్జిన్‌ వికటించినట్టు నిర్ధారణకు వచ్చారు. మయోసైటిస్‌ వచ్చినట్టు చెప్పారు. మెరుగైన పరీక్షల కోసం పూణేకు కూడా బ్లడ్‌ శాంపిల్‌ పంపించారు. అక్కడ కూడా అదే ఫలితం రావడంతో 14 నెలలుగా మయోసైటిస్‌ వ్యాధి చికిత్స చేశారు. రూ.1.50 లక్షల విలువ చేసే ఇంజక్షన్‌లను నెలకు ఒకటి, పరీక్షల రిపోర్టులను బట్టి ఒక్కో నెలలో రెండు, మూడు కూడా ఇస్తూ ట్రీట్‌మెంట్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకూ వెంకటరెడ్డి రూ.70 లక్షల వరకు దీని కోసం ఖర్చు చేశారు.
సినీ నటి సమంత సైతం..
సినీ నటి సమంత కూడా ఇదే వ్యాధితో బాధ పడుతున్నారు. దేశంలోని ప్రతి లక్ష మందిలో 20 మందికి ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 38 మంది మయోసైటిస్‌ వ్యాధి బారిన పడినట్టు అధికారికంగా నిర్ధారణైంది. వీరిలో 30 మంది చనిపోగా, మరో 8 మంది వైద్యసేవలు పొందుతూ కోలుకుంటున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న రెండేండ్ల తర్వాత వెంకటరెడ్డిలో ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి.
ఇంటిస్థలం.. భూములు అమ్మి వైద్యం
భద్రాచలంలో తనకున్న ఇంటి స్థలం, భూములు అమ్మడంతో పాటు గోల్డ్‌ లోన్‌ తీసుకుని హైదరాబాద్‌లోనే ఉంటూ వెంకటరెడ్డి వైద్యం చేయించుకుంటున్నారు. ఇప్పటికీ రూ.70 లక్షల వరకు ఖర్చు వచ్చింది. ఆస్పత్రికి తరచూ రావడం ఇబ్బందికరంగా మారడంతో కుటుంబసభ్యులతో కలిసి నిమ్స్‌ ఆస్పత్రికి సమీపంలో లక్డికాపూల్‌లో రోజుకు రూ.1200 చొప్పున కిరాయి చెల్లిస్తూ ఉంటున్నారు. వైద్యుల సలహాలు సూచనలు పాటిస్తూ ట్రీట్‌మెంట్‌ పొందుతుండటంతో రెండు నెలలుగా ఆరోగ్యంలో కొంత మెరుగుదల వస్తోంది. వెంకటరెడ్డి స్థితిని చూసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. రూ.2.50 లక్షల చొప్పున రూ.5లక్షల ఎల్‌వోసీ ఇచ్చారు. ఆరోగ్యం మెరుగయ్యే వరకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇవ్వడంతో ఇప్పటికే రెండుసార్లు కోమాలోకి వెళ్లిన తనకు కొండంత ధైర్యం వచ్చిందని బాధితుడు వెంకటరెడ్డి చెప్పారు.

కేంద్రం ఫార్మా కంపెనీలతో కుమ్మక్కైన ఫలితమే..
కేంద్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీలతో కుమ్మక్కై ప్రజల ప్రాణాల మీదకు తెస్తుంది. దాని ఫలితంగానే వ్యాక్సిన్‌లు వికటించి మయోసైటిస్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి. ప్రజల ప్రాణం కన్నా ప్రభుత్వం ఆదాయం మీదనే దృష్టి సారించింది కాబట్టే కార్పొరేట్‌ ఆస్పత్రులు విచ్చలవిడిగా దోచుకుంటున్నాయి. కరోనా వ్యాక్సిన్‌ వికటించటం వల్ల నాకొచ్చిన ఈ జబ్బు వల్ల నాతో పాటు నా భార్యాపిల్లలు ఎంత మానసికక్షోభ అనుభవించామో మాకే తెలుసు. ఇలాంటి ప్రాణాంతక వ్యాధులు నిరుపేదలకు వస్తే చావే శరణ్యమేమో..!. ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకోవాలి కానీ కార్పొరేట్‌ తొత్తులుగా మారవద్దు. నాకు ఇచ్చే రూ.లక్షన్నర ఇంజెక్షన్‌ను సైతం రిలయన్స్‌ ఫార్మా కంపెనీ రూపొందించేదే. ఇంత ధర వెచ్చించి సామాన్యులు ఎలా ఈ ఇంజెక్షన్‌ను కొనగలరో ప్రభుత్వాలు ఆలోచించాలి.
– కొల్లు వెంకటరెడ్డి, మయోసైటిస్‌ బాధితుడు

Spread the love