వైష్ణవ్‌ ఓ హీరో అట !

న్యూఢిల్లీ : బీజేపీ ఎప్పుడు సంక్షోభంలో చిక్కుకున్నా, ప్రజాగ్రహాన్ని చవిచూసినా ఆ పార్టీ అనుకూల యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగుతుంది. పార్టీపై వచ్చిన విమర్శలకు జవాబు ఇవ్వడానికే కాదు… ప్రతికూల పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చేసేందుకు అది సిద్ధంగా ఉంటుంది. బాలాసోర్‌ రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రాజీనామా చేయాలంటూ ఓ పక్క ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తుంటే బీజేపీ అనుకూల సోషల్‌ మీడియా మాత్రం ఈ వార్తకు ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. పైగా వైష్ణవ్‌ను హీరోగా చిత్రించేందుకు ఆపసోపాలు పడుతోంది. దుర్ఘటన జరిగిన వెంటనే మంత్రివర్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారని, శిథిలాల తొలగింపును దగ్గరుండి పర్యవేక్షించారని, రైలు పట్టాల పక్కనే కూర్చుని అధికారులు, సిబ్బందితో చర్చించారని, పట్టాల పక్కనే నడుస్తూ పరిస్థితిని నిశితంగా గమనించారని…ఇలా రకరకాల కథనాలను బీజేపీ అనుకూల మీడియా వండి వారుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే వైష్ణవ్‌ అంతా తానై, అన్నీ తానై వ్యవహరిస్తున్నారని కితాబులు ఇస్తోంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులు నవీన్‌ పట్నాయక్‌, మమతా బెనర్జీలు కూడా దుర్ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లినప్పటికీ మీడియాలో వారికి అంత ప్రాధాన్యత లభించలేదు. ఇరవై మూడు నెలల క్రితం రైల్వే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైష్ణవ్‌ ఇంత సంక్లిష్ట పరిస్థితిని ఎన్నడూ చవిచూడలేదు. పైగా ప్రమాదం జరిగిన ఒడిశాతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైష్ణవ్‌ ఐఎఎస్‌ అధికారిగా ఆ రాష్ట్రంలో పనిచేశారు. బాధితులకు, వారి కుటుంబాలకు సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అహర్నిశలూ కృషి చేస్తున్నప్పటికీ వైష్ణవ్‌ మాత్రం క్రెడిట్‌ అంతా తనకే దక్కాలన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఆయన శుక్రవారం నుండి ఇప్పటి వరకూ ఆరుసార్లు ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు. తాను సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నానని, వివిధ ప్రాంతాల నుండి సహాయక బృందాలను రప్పించానని మొదటి ట్వీట్‌లో చెప్పుకున్నారు. ఆ తర్వాత నష్టపరిహారంపై మరో ట్వీట్‌ చేశారు. అనంతరం చేసిన రెండు ట్వీట్లలో ట్రాక్‌ల పునరుద్ధరణ గురించి ప్రస్తావించారు. మరమ్మతుల అనంతరం ఆ మార్గంలో రాకపోకలు సాగించిన రైళ్లకు పచ్చజెండా ఊపుతున్నట్లు రెండు వీడియోలు కూడా పోస్ట్‌ చేశారు. ఈ రెండింటినీ రాత్రి సమయంలో తీశారు. ఒక వీడియోలో రైల్వే సిబ్బంది, అధికారులు ‘భారత్‌ మాతాకీ జై’, ‘వందేమాతరం’ అంటూ నినాదాలు చేయడం కన్పించింది. ఘోర ప్రమాదం జరిగి జాతి మొత్తం కలవరపడుతుంటే ఇది నినాదాలు చేయాల్సిన సమయమా అని పలువురు ప్రశ్నించారు. ఇంతటి విషాదంలోనూ వీరి ప్రచార్భాటాలను చూస్తుంటే..బాధితుల పట్ల వీరి చిత్తశుద్ధి ఏమిటో బోధపడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఏదేమైనా బీజేపీ అనుకూల మీడియా మాత్రం వైష్ణవ్‌ను ఆకాశానికి ఎత్తేసింది. మోడీ నాయకత్వంలో పనిచేస్తున్న ఇలాంటి సమర్ధుడు, నైతిక విలువలు కలవాడు, అంకితభావం కలిగిన నాయకుడిని రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయని మిన్నీ రజ్దాన్‌ అనే ఓ స్వామిభక్తుడు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు మీ తలపై తుపాకీని గురిపెెట్టినపుడు నిజమైన నాయకత్వాన్ని ప్రదర్శించారంటూ సివిల్‌ ఇంజినీర్‌ అన్షూ ట్వీట్‌ చేశారు. మరో ట్వీటర్‌ రితేష్‌ కుమార్‌ ఓ అడుగు ముందుకేసి ఆధునిక భారతావనికి వైష్ణవ్‌ ఓ దిక్సూచి వంటివాడని కీర్తించారు

Spread the love