– ప్రయాణానికి జంకుతున్న ప్రజలు?
– ఈ రైళ్లలో రద్దీ తగ్గటానికికారణమిదేనా?
– ప్రయాణికుల డిమాండ్ స్థిరంగా ఉండదు
– కాలాన్ని బట్టి రద్దీ ఉంటుంది : కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టికెట్ ధరలు ప్రయాణికులకు షాకిస్తున్నాయి. ఈ కారణంతోనే ఈ రైళ్లలో ప్రయాణించేవారి సంఖ్య తక్కువగా ఉంటున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. దేశంలోని మిగతా రైళ్ల ధరలతో పోలిస్తే.. వందే భారత్ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో వందే భారత్ రైళ్ల టికెట్ ధరలు ఆది నుంచీ చర్చనీయాంశంగానే మారాయి. వందేభారత్ రైళ్లలో లోపాలు, అందులో ఉన్న సదుపాయాలు గురించి ఫిర్యాదులు, జరుగుతున్న ప్రమాదాలకు సంబంధించి ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్‌గా మారిన విషయం విదితమే. భారత్.. దేశీయంగా రూపొందించిన తొలి సెమీ-హైస్పీడ్ రైలు అయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను 2019లో ప్రారంభించింది. ఇందులో ఆధునిక వసతులు ఉన్నాయనీ, ప్రయాణికులకు మంచి అనుభూతిని కలిగించటమే కాకుండా.. సమయాన్ని కూడా మిగుల్చుతుందని కేంద్రం తీవ్ర ప్రచారాన్ని కల్పించింది. ప్రస్తుతం భారత్‌లో మొత్తం 136 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. ఈ ఏడాది కేంద్ర రైల్వే శాఖ దేశవ్యాప్తంగా 46 వందే భారత్ ట్రైన్లను ప్రవేశపెట్టింది.
వందేభారత్ ట్రైన్‌ల గురించి మోడీ ప్రభుత్వం ఎంతోగానో గొప్పలు చెప్పుకున్నది. తమ పాలనలో రైల్వే వ్యవస్థ పురోగమిస్తున్నదనటానికి వందే భారత్ ఒక సంకేతంగా ప్రచారం చేసుకున్నది. అయితే, వందే భారత్ రైళ్లలో టికెట్ ధరలు చూస్తే మాత్రం షాక్ కావాల్సిందే. భారత్‌లోని ఇతర ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ ట్రైన్ల కంటే.. వందే భారత్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దేశంలోని ప్రముఖ నగరాలను లక్ష్యంగా చేసుకొని తీసుకొచ్చిన ఈ వందే భారత్ ట్రైన్లలో సాధారణ మధ్యతరగతికి చెందిన ప్రజలు ప్రయాణించాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందేనని విశ్లేషకులు చెప్తున్నారు.
వందే భారత్‌లో అధిక ధరలపై ఎంపీల నుంచి కూడా ప్రశ్నలు తలెత్తాయి. కొందరు ఎంపీలు ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ముందు కూడా ప్రస్తావించారు. అయితే, రిజర్వ్ చేయబడిన రైలు సీట్ల కోసం ప్రయాణికుల డిమాండ్ స్థిరంగా ఉండదని ఆయన తెలిపారు. ఇది రద్దీ సమయాల్లో పెరుగుతుందనీ, రద్దీ సమయాలు కానప్పుడు తగ్గుతుందని వివరించారు. 2024-25 (ఈ ఏడాది అక్టోబర్ నాటికి) వందే భారత్ రైళ్లలో ఓవరాల్ ఆక్యుపెన్సీ వంద శాతం కంటే ఎక్కువగానే ఉన్నదని లోక్‌సభ సమావేశాల్లో భాగంగా ఒక ప్రకటనలో ఆయన వివరించారు.కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కేవలం నగరాల్లో ఉండే సంపన్నులను దృష్టిలో ఉంచుకొనే వందే భారత్ వంటి రైళ్లను తీసుకొచ్చిందనే వాదనలూ వినబడుతున్నాయి. తమ పాలనలో భారత రైల్వే కొత్త పుంతలు తొక్కుతున్నదన్న మోడీ సర్కారు ప్రకటనలు ‘మేడి పండు చందమే’నని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా, పేద, మధ్యతరగతి ప్రజలు ప్రయాణించే రైళ్లలో రద్దీ విపరీతంగా ఉంటుందనీ, రైళ్లలో అరకొర సౌకర్యాలతో ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అంటున్నారు. మోడీ పాలనలో రైల్వే ద్వారా సాధారణ ప్రయాణికులకు ఒరిగిందేమీ లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా, ప్రయాణి కుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మోడీ సర్కారు రైళ్లలో కనీస సదుపాయలను మెరుగుపర్చి, జనరల్ బోగీల సంఖ్యను పెంచటంపై దృష్టి పెట్టాలని వారు సూచిస్తున్నారు.