‘చేతి’కే వెన్నుపోటు పొడిచిన వనమా..

– ఎవరికి టికెట్‌ వచ్చినా గెలిపించుకోవాలి
– బీసీ అభ్యర్థికి టికెట్‌ ఖాయం : జన చైతన్య సభలో మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి
నవతెలంగాణ-కొత్తగూడెం
అన్నం పెట్టిన ‘చేతి’కే స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వెన్నుపోటు పొడిచారని, ఆయన కుటుంబం చేసిన దుర్మార్గానికి ఓ అమాయక కుటుంబం దారుణంగా బలైందని కాంగ్రెస్‌ నాయకులు, మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఎవరికి టికెట్‌ ఇచ్చినా ఆ అభ్యర్థిని గెలిపించుకోవాలని, బీసీ అభ్యర్థికే టికెట్‌ ఖాయమని చెప్పారు. బుధవారం కొత్తగూడెం పట్టణానికి ఆమెకు.. కాంగ్రెస్‌ అభిమానులు, ప్రజా ప్రతినిధులు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం సూపర్‌ బజార్‌, రైల్వే అండర్‌ బిడ్జ్రి మీదుగా బస్టాండ్‌ సెంటర్‌ వద్దకు ర్యాలీగా వచ్చి.. అక్కడున్న అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అక్కడినుంచి ర్యాలీగా కొత్తగూడెం క్లబ్‌కు చేరుకున్నారు. అనంతరం అక్కడ నిర్వహించిన జన చైతన్య సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. యాభై ఏండ్ల రాజకీయ జీవితం అని చెప్పుకుంటున్న వనమా వెంకటేశ్వరరావుకి కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందని, కానీ అన్నం పెట్టిన చేతికే వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వనమా వెంకటేశ్వరరావు కుమారుడు చేసిన దుర్మార్గానికి ఒక కుటుంబం మూకుమ్మడిగా బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఏదైనా సమస్య వస్తే ఎమ్మెల్యే ఇంటికి ధైర్యంగా వెళ్లగలరా అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగాయని, పేద ప్రజలకు చౌక దుకాణాల ద్వారా అందించే సరుకులు ఎత్తివేశారని విమర్శించారు.
రాబోయే ఎన్నికల్లో మోసపూరిత రాజకీయ పార్టీలకు ఓటు వేయొద్దని, ఓటును అమ్ముకోవద్దని సూచించారు. రాబోయే ఎన్నికల్లో కారు గల్లంతవుతుందన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసిన కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నేషనల్‌ ఓబీసీ కో ఆర్డినేటర్‌ కత్తి వెంకటస్వామి, టీపీసీసీ జనరల్‌ సెక్రెటరీ ఎడవల్లి కృష్ణ, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Spread the love