జమ్మూ కాశ్మీర్ : జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన పై వందేభారత్ రైలు తొలి కూత పెట్టింది. ఈ వంతెనపై శనివారం వందేభారత్ రైలు ఫస్ట్ ట్రయల్ రన్స్‌ను నిర్వహించారు. ట్రయల్ రన్స్‌లో భాగంగా శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా స్టేషన్ నుంచి శ్రీనగర్ స్టేషన్ వరకూ వందే భారత్ రైలు పరుగులు తీసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక వందేభారత్ టికెట్ ధర విషయానికి వస్తే.. ఢిల్లీ నుంచి కాశ్మీర్‌కు రూ.1,500 నుంచి రూ.2,100గా నిర్ణయించినట్లు తెలుస్తున్నది. రైలు మార్గమధ్యలో జమ్మూ, శ్రీమాతా వైష్ణోదేవి కత్రాలో స్టాప్స్ ఉండనున్నట్లు సమాచారం.
కాశ్మీర్ లోయలోని అతిశీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ వందే భారత్ రైలును ప్రత్యేకంగా రూపొందించారు. నీరు గడ్డ కట్టకుండా ఉంచేలా అత్యాధునిక హీటింగ్ వ్యవస్థలను ఇందులో ఏర్పాటు చేశారు. కాగా.. గతేడాది జూన్‌లో ఈ వంతెనపై రైలు ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తునున్న ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు. ఇప్పటివరకూ చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబారు రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం.
కాశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. మొత్తం 272 కిలోమీటర్ల మేర ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టును నిర్మించారు. ఈ లింక్ ప్రాజెక్ట్ దాదాపు పూర్తయింది. కత్రా, రిసియా మధ్య కొంత మేర పెండింగ్‌లో ఉంది. ఇది మరికొన్ని రోజుల్లోనే పూర్తి కానుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక రైళ్లు రియాసి జిల్లాలోని అంజి వంతెన, చీనాబ్ వంతెన ద్వారా ఉధంపూర్, జమ్ము, కాట్రా గుండా వెళతాయి. సంగల్దాన్, బనిహాల్ మీదుగా నేరుగా శ్రీనగర్, బారాముల్లా చేరుకుంటాయి. దీంతో రోడ్డు మార్గంతో పోలిస్తే ఆరు గంటలు ఆదా అవుతుంది. ప్రయాణం కూడా చాలా సులభతరం.