వానొచ్చే.. వరదొచ్చే

– భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం…
– కుంటలను తలపిస్తున్న పంట పొలాలు, రోడ్లు
– రాకపోకలు బంద్‌
– ఉరకలేస్తున్న వాగులు

– గేట్లు తెరుచుకున్న ప్రాజెక్టులు
– గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
నవతెలంగాణ- మొఫసిల్‌ యంత్రాంగం
రాష్ట్రంలో వర్షాలు ఎడతెరిపివ్వకుండా దంచికొడుతు న్నాయి.. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు నిండి అలుగు పారుతున్నాయి. నదులు, ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. వాగులు ఉరకలేస్తున్నాయి. కొన్నిచోట్ల పంట పొలాలు, గ్రామాల రోడ్లూ చెరువులను తలపిస్తున్నాయి. పైర్లు నీట మునిగి మురిగిపోతున్నాయి. వరదలతో మారుమూల గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. ఇండ్లల్లోకి మురుగు నీరు చేరింది. కొన్ని గ్రామాల నుంచి బయటకు రావాలంటే ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను దాటాల్సి ఉంది. ఈ క్రమంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని వాగులను దాటుతున్నారు. సిద్దిపేట జిల్లాలో బుధవారం ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తి చనిపోతే.. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటి అవతల ఉన్న శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేయాల్సి వచ్చింది. భద్రాద్రిలో గోదావరి ప్రమాద హెచ్చరిక జారీ అయింది.ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమయమాయ్యాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీల్లో కొన్ని గ్రామాలు జలదిగ్భందంలో ఉన్నాయి. గోదావరి నది, కిన్నెరసాని ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల ప్రజలను మైదాన ప్రాంతాలకు తరలించారు. ఖమ్మం నగరంలోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వైరా, పాలేరు రిజర్వాయర్లు అలుగు పోస్తున్నాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం ఉదయం 5గంటలకు 39.5 అడుగులు ఉన్న గోదారి క్రమేపీ పెరుగుతూ సాయంత్రం 6 గంటలకు 46.2 అడుగులకు చేరింది. రాత్రి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా. ప్రస్తుతానికి మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. పట్టణంలోని అశోక్‌నగర్‌ కొత్త కాలనీ కరకట్ట ప్రాంతంలో సుమారు 50 ఇండ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆ ఇండ్ల వారిని రెవెన్యూ, పంచాయతీ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. రామాలయ ప్రాంతంలో స్లూయిజులు వద్ద మోటర్లు పూర్తిస్థాయిలో పని చేయకపోవడం వల్ల పరిసర ప్రాంతం, అన్నదాన సత్రం మొత్తం వరద నీటిలో చిక్కుకుంది. ఇప్పటికే ఈ నెలలో మూడుసార్లు అధికారుల నిర్లక్ష్యంతో వరద నీటితో సర్వం కోల్పోయిన వ్యాపారస్తులకు మరోసారి ముప్పు తప్పని పరిస్థితి నెలకొన్నది. కొత్త కాలనీలోని కరకట్ట ప్రాంతం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇటు గోదారి ఉగ్రరూపం.. అటు శబరి నది ఉప్పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో పోలవరం ముంపు మండలాలైన చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, ఎటపాక మండలాలు వరదల్లో చిక్కుకుంటున్నాయి. ఇప్పటికే వీఆర్‌ పురం, చింతూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని అనేక గ్రామాలను శబరి ముంపుకి గురయ్యాయి. ఏజెన్సీ వ్యాప్తంగా అనేక గ్రామాలకు రాకపోకలు ఇప్పటికే నిలిచిపోయాయి. పోలవరం వద్ద కాపర్‌ డాం గేట్లు పూర్తిగా ఎత్తకపోవడం వల్ల ముంపు మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం ఇదే నెలలో వరదలతో సర్వం కోల్పోయిన బాధితులు మరోసారి గోదారమ్మ ఉగ్రరూపానికి బలయ్యారు. గోదావరి పరివాహక మండలాలైన భద్రాచలం, బూర్గంపాడు, మణుగూరు, అశ్వాపురం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.పాల్వంచ కిన్నెరసాని 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం 405.80 అడుగులు నీరు చేరింది. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక చేశారు. కొత్తగూడెం, కిష్టారం, సత్తుపల్లి, మణుగూరు ఓసీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 2లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగిందని అధికారులు తెలిపారు. మణుగూరులో కట్ట వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చర్లలోని తాలిపేరు ప్రాజెక్టు 15 గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తి 11,5956 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టును ప్రస్తుత హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌ సందర్శించి వరద ఉధృతిని పర్యవేక్షించారు. భద్రాచలం – పర్ణశాల మధ్య రోడ్డుపై రాకపోకలు నిలిచాయి.యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలంలోని రుద్రవెల్లి బ్రిడ్జి వద్ద ముసీనది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బీబీనగర్‌ – పోచంపల్లికి రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. భువనగిరి రూరల్‌ సిఐ సత్యనారాయణ, బీబీనగర్‌ ఎస్‌ఐ యుగేందర్‌ గౌడ్‌, పరిశీలించి బ్రిడ్జి వద్ద సిబ్బందిని కాపలా పెట్టారు.ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మోస్తారు వర్షపాతం నమోదైంది. పలు చోట్ల భారీ వర్షం కురిసింది. నార్సింగ్‌ మున్సిపాలిటీలోని గౌలిదొడ్డి గ్రామంలో ఇండ్ల మధ్యన ఉన్న భారీ చెట్టు కూలిపోయింది. రాజేంద్రనగర్‌ నియోజకవర్గం పరిధిలోని బుద్వేల్‌ భగవత్‌గూడాలో ఓ వృద్ధురాలి ఇల్లు కూలిపోయింది.రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌, గంభీరావుపేట మండలాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు అత్యధిక వర్షపాతం నమోదైంది. కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఓ మోస్తారు వర్షపాతం నమోదైంది. శ్రీపాద ఎల్లంపలి ప్రాజెక్టు 11గేట్లు ఎత్తి 81,137 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దిగువమానేరు ప్రాజెక్టులోకి మోయతుమ్మెద వాగు నుంచి వరద కొనసాగుతోంది. శ్రీరాజరాజేశ్వర (మధ్యమానేరు) ప్రాజెక్టులోకి ఎగువ నుంచి మానేరు, మూల వాగు ద్వారా 9వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు స్పిల్‌ వే నుంచి 2గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
గుంతలమయమైన రోడ్లు
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని అభ్యుదయం కాలనీ జలమయమైంది. రోడ్లు నడవడానికి వీలు లేకుండా గుంతలు పడ్డాయి మంగపేట మండలంలో అబ్బాయిగూడెం ప్రధాన రోడ్డు కొట్టుకుపోయింది. శనిగకుంటకు వెళ్లే దారిలోని పెద్ద ఒర్రె పొంగిపొర్లుతూ రాకపోకలు నిలిచిపోయాయి. తిమ్మంపేట పెద్ద చెరువు, రామచంద్రునిపేట ఊర చెరువు, మంగపేట ఊర చెరువు, చెరుపల్లి చెరువులు మత్తళ్లు పడేందుకు సిద్దంగా ఉన్నాయి. గౌరారం వాగు, కమలాపురం ఎర్రవాగు, మల్లూరు వాగు, రాజుపేట ముసలమ్మ వాగులు పొంగిపొర్లుతున్నాయి. మేడిగడ్డ, లక్ష్మీబ్యారేజి, తుపాకులగూడెం బ్యారేజ్‌ గేట్లను అధికారులు ఎత్తారు. రామన్నగూడెం పుష్కర ఘాట్‌ వద్ద వరదనీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడూ పరిశీలిస్తున్నారు. హనుమకొండ జిల్లా చౌరస్తా మొత్తం జలమయమైంది. ఆత్మకూర్‌ మండలంలో పత్తి పంటలు నీటిలో మునిగిపోగాయి. చలి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల వారిని మైదాన ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కటాక్షపూర్‌ మత్తడితో రాకపోకలకు అంతరాయమేర్పడింది. కాజీపేట మండలం సోమిడి ప్రగతినగర్‌ కాలనీలో యాట హర్షవర్ధన్‌రెడ్డి ఇంటిపై పిడుగు పడటంతో ఎలక్ట్రికల్‌ వస్తువులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. శాయంపేటమండలంలో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టు అలుగు పోస్తుంది. వరదతో సాగు భూముల్లో ఇసుక మేటలు వేశాయి. నారాయణపురం క్రాస్‌ రోడ్‌ నుంచి జామాల్‌ పురం గ్రామానికి వెళ్లే రోడ్డు వరద నీటితో గండిపడింది. వరంగల్‌ జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్ళ లోతు నీళ్లు చేరాయి. కల్లెడ ఆకేరు వాగు పాత బ్రిడ్జి సమీపంలో ఉన్న 120 ఏళ్ల చరిత్ర కలిగిన మర్రి చెట్టు(దెయ్యాల మర్రి) నేలమట్టమయింది. మానుకోట జిల్లా మున్నేరు, ఆకేరు, పాలేరు వాగులు పొంగిపొర్లి ప్రవహిస్తున్నాయి. కేసముద్రం గూడూరు వెళ్లే రహదారులు అర్పణ పెళ్లి వాగు పొంగిపోయి రాకపోకలు రద్దయ్యాయి. బ్రిడ్జిపై నుంచి భారీగా నీరు ప్రవహిస్తోంది. మానుకోట- వరంగల్‌కు రహదారులు బంద్‌ అయ్యాయి. మానుకోట పట్టణంలో జూనియర్‌ కళాశాల ఎదురుగా డీఎస్పీ కార్యాలయం వద్ద మురికి కాలులు పొంగి పొల్లి ప్రవహించడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.
మూసీకి పోటెత్తిన వరద,7 గేట్లు ఎత్తి 13,308 క్యూసెక్కుల నీరు విడుదల
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండో పెద్ద ప్రాజెక్టు అయిన మూసీ రిజర్వాయర్‌కు వరద పోటెత్తడంతో బుధవారం ప్రాజెక్టు 7 క్రస్ట్‌ గేట్లను మూడు అడుగుల ఎత్తు మేర ఎత్తి దిగువకు 13,308 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి 10,354 వరద నీరు వచ్చి చేరుతోందని నీటిిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 642.10 అడుగుల వద్దకు చేరుకుంది. పూర్తిస్థాయి సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.72 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా 282 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు 7 గేట్లను ఒకేసారి మూడు అడుగుల ఎత్తు లేపడంతో దిగివ మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మూసీ గేట్లు ఎత్తడంతో పర్యాటకుల సందడి ఎక్కువైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నామని డ్యామ్‌ ఇంజినీర్లు ఉదరుకుమార్‌, మమత చెప్పారు.
గండిపేట్‌ 2గేట్లు ఎత్తివేత,జంట జలాశయాలకు భారీగా వరద నీరు
ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలలోకి నీటి వరద ప్రవాహం పెరిగింది. వరద ఉధృతికి జంట జలాశయాల గేట్లను ఎత్తారు. బుధవారం రాజేంద్రనగర్‌ ప్రకాష్‌గౌడ్‌ అధికారులతో కలిసి ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట్‌) రెండు గేట్లను ఎత్తారు. ఎగువ ప్రాంతాలైన తాండూర్‌, పరిగి వికారాబాద్‌, శంకర్‌పల్లి ప్రాంతాల నుంచి మూసీ ఉధృతంగా ప్రవహించడంతో గండిపేట చెరువు నీటిమట్టం పూర్తిగా నిండిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 208 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఇప్పటికే హిమాయత్‌సాగర్‌ నాలుగు గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు. వరద మరింత పెరిగితే ఉస్మాన్‌సాగర్‌ మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉందన్నారు. గేట్లు ఎత్తడంతో మూసీకి దిగువన ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. మూసీ పరివాహ ప్రాంతాలకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
వచ్చే రెండ్రోజులు భారీ వర్షాలే
– పలు జిల్లాలకు రెడ్‌, ఆరెంజ్‌ హెచ్చరికల జారీ
– హైదరాబాద్‌, చుట్టుపక్కల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం

– భద్రాద్రి కొత్తగూడెంలో కుండపోత
– 29.02 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
– ఈ ఏడాది ఇదే అత్యధికం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో పలు జిల్లాల్లో వచ్చే రెండు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబా బాద్‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నిర్మల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలను జారీ చేశారు. ఈ జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అదే సమయంలో గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఉత్తర ఆంధ్రప్రదేశ్‌-దక్షిణ ఒడిశా మధ్య ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నదనీ, నెమ్మదిగా కదులుతూ అది తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు.
రాష్ట్రం మీదుగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతుండటంతో రాబోయే మూడు రోజులు ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు, కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. బుధవారం రాత్రి 11 గంటల వరకు 29.02 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది రాష్ట్రంలో ఇదే రికార్డు. భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాల్లో 33 చోట్ల అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. అక్కడ 12 సెంటీమీటర్లకుపైనే వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో బుధవారం రాత్రి 11 గంటల వరకు 908 ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాగా, 135 ప్రాంతాల్లో భారీ, 414 ప్రాంతాల్లో మోస్తరు వానలు పడ్డాయి.
అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లాలు (బుధవారం రాత్రి 10 గంటల వరకు)
కరకగూడెం (భద్రాద్రి కొత్తగూడెం) 29.02 సెంటీమీటర్లు
కొత్తగూడెం(భద్రాద్రి కొత్తగూడెం) 21.73 సెంటీమీటర్లు
కల్లెడ(వరంగల్‌) 19.03 సెంటీమీటర్లు
సుజాతనగర్‌(భద్రాద్రి కొత్తగూడెం) 17.45 సెంటీమీటర్లు
లక్ష్మీదేవిపల్లి (భద్రాద్రి కొత్తగూడెం) 17.15 సెంటీమీటర్లు
కారేపల్లి(ఖమ్మం) 15.25 సెంటీమీటర్లు
ఏడూళ్ల బయ్యారం (భద్రాద్రి కొత్తగూడెం) 15.20 సెంటీమీటర్లు

Spread the love